టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మా నౌకరీలు మాగ్గావాలే అనే నినాదంతో బీజేపీ ఇవాళ నిరుద్యోగ మహాధర్నా తలపెట్టింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఈ రోజు ఇందిరా పార్కు ధర్నాచౌక్ వేదికగా ‘మా నౌకరీలు మాగ్గావాలే’ అనే నినాదంతో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నాం 3 గంటల వరకు మహాధర్నా చేయనుంది.
మహాధర్నా కోసం బీజేపీ రాష్ట్ర నాయకత్వం పోలీసుల అనుమతి కోరింది. మొదట పోలీసులు అనుమతి నిరాకరించడంతో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరిపిన న్యాయస్థానం ధర్నాకు షరతులతో అనుమతి ఇచ్చింది. మహాధర్నాను విజయవంతం చేసేందుకు ఇప్పటికే ఇందిరా పార్కు ధర్నాచౌక్ వద్ధ కాషాయదళం అన్ని ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న బీజేపీకి టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ ఒక అస్త్రంగా దొరికింది. ఇప్పటికే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూనే.. క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న కాషాయపార్టీకి ఈ అవకాశం అందివచ్చింది.