అసెంబ్లీలో కనీసం తమకు టిఫిన్ చేసే సదుపాయం కూడా లేదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఓ ఎమ్మెల్యేకు ఇది అవమానకరమని వాపోయారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే ఈటల మాటలను మంత్రి హరీశ్ రావు తప్పుబట్టారు. బడ్జెట్‌పై చర్చించే సమయంలో సదుపాయాలపై మాట్లాడటం తగదని చెప్పారు. అలాంటి అంశాలను సభాపతి కార్యాలయానికి వెళ్లి విజ్ఞప్తి చేయాలని సూచించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు జోక్యం చేసుకొని ఈటలకు శాసనసభ సంప్రదాయాలను వివరించారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగాయి. బడ్జెట్‌పై ఉభయ సభల్లో సాధారణ చర్చ ప్రారంభమైంది. ఆ బడ్జెట్‌పై శాసనసభ, శాసనమండలిలో చర్చ జరిగింది. మొదటగా.. ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడారు. కేంద్రప్రభుత్వం ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రగతిని అడ్డుకుంటోందని ఓవైసీ విమర్శించారు. అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చను ప్రారంభించిన అక్బరుద్దీన్.. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు నిధులు రావట్లేదని తెలిపారు.