ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ ప్రకటనపై ఓవైపు ప్రశంసలు, అభినందలను కురుస్తోంటే.. మరోవైపు బీజేపీ నాయకులు విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ ప్రకటనపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్పందించారు. జాతీయ పార్టీ ప్రకటనతో కేసీఆర్ ఉద్యమ పార్టీని ఖతం చేశారని ఈటల మండిపడ్డారు. ఇన్ని రోజులు తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు అని పాట పాడిన కేసీఆర్ కు ఇప్పుడు రాష్ట్రంతో, రాష్ట్ర ప్రజలతో బంధం తెగిపోయిందని ఈటల అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో తెలంగాణకు, ఉద్యమ నేత సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం తెగిపోయిందని ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సమస్యలు పరిష్కరించలేని కేసీఆర్ ఇప్పుడు దేశాన్ని ఉద్దరించడానికి బయలుదేరారని విమర్శించారు.
కూట్లో రాయి తీయలేని వాడు ఏట్లో రాయి తీయడానికి పోయినట్టుందని ఈటల ఎద్దేవా చేశారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో చక్రం తిప్పేందుకు వెళ్తున్న కేసీఆర్ పగటి కలలు కంటున్నారని, అది కలగానే మిగిలిపోతుందని ఈటల పేర్కొన్నారు.