రాష్ట్రంలో బీజేపీ నేతలు ఉన్నారా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఏం చేస్తున్నారు?.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇలాంటి ప్రశ్నలే కనిపిస్తున్నాయి. వినిపిస్తున్నాయి. దీనికి కారణం ఏంటి? అని ఆరా తీస్తే..రాష్ట్రంలో ఏం జరిగినా.. తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ముందుండే కమలం పార్టీ నేతలు ఇటీవల జరుగుతున్న తాజా పరిణామాలపై పన్నెత్తు మాట మాట్లాడడం లేదు. న్యాయవ్యవస్థ, తిరుమల ఆస్తులు.. బీసీలకు పదవులు.. ఇలా ఏం జరిగినా.. నాయకులు మౌనంగా ఉన్నారు. నిజానికి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించే బీజేపీ రాష్ట్ర సారథి సోము వీర్రాజు.. కొన్నాళ్ల కిందట భారీ ఎత్తున హడావుడి చేసిన విషయం తెలిసిందే.
ముఖ్యంగా హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, అంతర్వేది రథం దగ్ధం ఘటన, విజయవాడ కనకదుర్గ ఆలయంలో జరిగిన వెండి సింహాల మాయం ఘటనలపై ఆయన వెంటనే స్పందించారు. ఆయా ప్రాంతాల్లో సందర్శించారు. ఈ క్రమంలో ఆయన వెంటనే వాటిపై సీబీఐ వేయాలని కూడా డిమాండ్ చేశారు. దీంతో బీజేపీలో ఒకింత బూమ్ వచ్చిందని, నాయకులు కలుస్తున్నారని, ఇదే దూకుడు కొనసాగిస్తే.. సోము వీర్రాజు భావిస్తున్నట్టుగా.. వచ్చే ఎన్నికల నాటికి పార్టీ పుంజుకోవడం ఖాయమని అందరూ అనుకున్నారు.
అప్పటి వాతావరణం కూడా అలానే అనిపించింది. ఎందుకంటే.. బీజేపీ శ్రేణులు అంతర్వేది రథం దగ్ధం ఘటనపై స్పందించిన తీరు బాగానే ఉంది.
అయితే, ఇంతలోనే సోము చప్పబడిపోయారనే టాక్ వినిపిస్తోంది. దేవాలయాలపై దాడుల ఘటనల తర్వాత.. రెండు కీలక అంశాలు తెరమీదకి వచ్చాయి. ఒకటి.. తిరుమల శ్రీవారికి చెందిన వేల కోట్ల నిధులను ప్రభుత్వం అప్పుగా తీసుకుంటోందని, ఎక్కడా అప్పు పుట్టకపోవడంతో హిందువులు ఎంతో భక్తితో ఇచ్చిన నగదును వాడుకొనేందుకు సిద్ధమైందని వార్తలు వచ్చాయి.
అదే సమయంలో సీఎం జగన్.. సుప్రీం కోర్టుకు రాసిన లేఖ.. సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీరమణపై చేసిన వ్యాఖ్యల వెనుక కేంద్రంలోని బీజేపీ పెద్దలు ఉన్నారన్న చర్చ తెరమీదికి వచ్చింది. మరి ఇంతగా పెద్ద ఎత్తున ప్రోపగాండ జరిగినా.. కూడా బీజేపీ నేతలు కిక్కురు మనలేదు. పైగా కేంద్రంలోని బీజేపీ నేతలను ఏమన్నా విరుచుకుపడే కొందరు నేతలు కూడా మౌనం పాటించారు. మరి ఏం జరిగింది? జగన్‌పై జాగ్రత్త .. అని కేంద్రం నుంచే సంకేతాలు అందాయా ? లేక.. మరేదైనా కారణం ఉందా ? ఇవే ఇప్పుడు అంతుచిక్కని ప్రశ్నలు.
– vuyyuru subhash