మొయినాబాద్ ఫామ్‌హౌస్ ఘటనపై హైకోర్టులో బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనకు సంబంధించి ప్రత్యేక విచారణ బృందంతో విచారణ చేయించాలని కోరింది. రాష్ట్ర పోలీసుల వ్యవహారశైలిపో తమకు అనుమానం ఉందని అభ్యంతరం చెప్పింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయాలని పిటిషన్ లో పేర్కొంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మునుగోడు ఉపఎన్నికలో ఓటమి భయంతోనే టీఆర్ఎస్ తమపై నింద మోపుతోందని తమను బద్నాం చేయడానికే ఇలాంటి కుట్రలు పన్నుతోందని బీజేపీ ఆరోపించింది. ప్రభుత్వ పాలనలో అభివృద్ధి జరిగి ఉంటే ప్రజలే వారి పాలనకు పట్టం కడతారని గుర్తించాలని బీజేపీ నాయకులు అన్నారు. ఓటమి భయంతో టీఆర్ఎస్ నేతలు అన్ని విధాలుగా బీజేపీ గెలుపును అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.