తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలలో తామే పోటీ చేస్తున్నామని ఏపీ బీజేపీ ప్రకటించింది. దీంతో ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరుగుతోంది. ఈ సీటు ఎస్సీకి రిజర్వ్ చేసి ఉండడంతో ఎవరికి సీటు ఇవ్వాలనే దాని మీద ఈరోజు విజయవాడలో బీజేపీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. తిరుపతి ఉప ఎన్నికలతో పాటు రాష్ట్రంలో తాజా పరిణామాలపై చర్చించారు. ప్రధానంగా నలుగురి పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ముగ్గురు రిటైర్ అధికారులు, మరో స్థానిక నేత పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఆ నలుగురిలో రిటైర్డు ఐఏఎస్ అధికారులు దాసరి శ్రీనివాసులు, రత్నప్రభ, రిటైర్డ్ డీజీపీ కృష్ణప్రసాద్ ల పేర్లు, తిరుపతి బీజేపీ నేత ముని సుబ్రమణ్యం పేరు కూడా వినిపిస్తోంది. అయితే వీరి నలుగురిలో దాసరి శ్రీనివాసులుకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పేరు మొదటి నుంచి బలంగా వినిపిస్తోంది. ఇక మరో రెండు, మూడు రోజుల్లో అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. వైసీపీ నుంచి కూడా ఒక డాక్టర్ పేరు తెర మీదకు వచ్చినా అది అధికారిక ప్రకటన కాకపోవడంతో ఎవరిని పోటీకి దింపుతారు అనేది ఆసక్తికరంగా మారింది.