గ్రామాలు, పల్లెల్లో మారుమూల ప్రదేశాలలో చేతబడులు చేసిన ఆనవాళ్లు కనిపించడం సాధారణమే కానీ తాజాగా ఏకంగా ప్రభుత్వ పాఠశాలలో చేత బడి చేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఏపీలోని కృష్ణాజిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో చేతబడుల కలకలం రేగింది. ముసునూరు మండలం రమణక్కపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గత రాత్రి చేతబడి చేసిన ఆనవాళ్లు బయటపడ్డాయి.
స్కూల్లో చేతబడి ఆనవాళ్లు కనిపించడం తో ఉదయాన్నే పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. స్కూల్లో నిమ్మకాయలు, పసుపు, కుంకుమ, కోడి నెత్తురు ఉండడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలలో చేతబడులు చేయడం ఏంటి..? ఇది ఆకతాయిలు పనా లేక నిజంగా చేతబడులు చేశారా..? అని పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక స్కూల్లో చేతబడి కలకలం రేగడంతో బడికి పంపించేందుకు తల్లి తండ్రులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు.