తమిళనాడు ప్రతిపక్ష నేత, డీఎంకే అధినేత స్టాలిన్ ఎన్నికల ప్రచారంలో పేలుడు కలకలం రేగింది. నిన్న స్టాలిన్ ప్రచారం సమయంలో తాంబరం సమీపంలో ఓ బిల్డింగ్ పైన పెద్ద ఎత్తున టపాసులు పేలాయి. దీంతో భవనం కింద ఉన్న పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. అలానే భారీ పేలుడు శబ్దం భయంతో కార్యకర్తలు పరుగులు తీసినట్టు తెలుస్తోంది. దీంతో అక్కడ మహిళా కార్యకర్తలకి తొక్కిసలాటలో తీవ్ర గాయాలయ్యాయని చెబుతున్నారు.
ఇక మాజీ సీఎం జయలలిత మరణం వెనుక మిస్టరీని వెల్లడించాలని తమిళనాడు ముఖ్యమంత్రి కే పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వంకు స్టాలిన్ సవాల్ విసిరారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ కేసు మిస్టరీని చేధిస్తామని స్టాలిన్ భరోసా ఇచ్చారు. దివంగత నేత మరణానికి దారితీసిన పరిస్థితులను వెలికి తీసేందుకు సీఎం, డిప్యూటీ సీఎంలు ఆసక్తి కనబరచడం లేదని స్టాలిన్ ఆరోపించారు. జయ మరణంపై దర్యాప్తునకు ఏర్పాటు చేసిన కమిషన్ ఎదుట వీరు హాజరు కాలేదని దుయ్యబట్టారు.