ఈరోజుల్లో అందరూ ప్యాకెట్ పసుపునే వాడుతున్నారు. పసుపు కొమ్ములను తెచ్చుకుని వాటిని దంచుకోని వాడేవాళ్లు చాలా తక్కువ.. మనకు తెలిసిన పసుపు కొమ్ము పసుపు రంగులోనే ఉంటుంది. కానీ నీలం రంగులో ఉండే పసుపు కొమ్ములను మీరెప్పుడైనా చూశారా..? దీన్ని హిందీలో ‘కాలీ హల్దీ’ అంటారు. మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వీటిని కొన్నిచోట్ల వాడతారు. ఈ మూలికను ముక్కలు చేసి చూస్తే లోపల అంతా నీలంగా ఉంటుంది. ఈ పసుపు కొమ్మువల్ల ఏం ప్రయోజనాలు ఉన్నాయో పూర్తి వివరాలు చూద్దామా..!
ఈ నీలం పుసుపు ఎక్కడపడితే అక్కడ పండదు. తేమతో కూడిన అటవీ ప్రాంతాల్లోనే పెరుగుతుంది. ఎక్కువగా ఈశాన్య భారతదేశంలో కనిపిస్తుంది. దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా పెరుగుతుంది. దీని రుచి, కాస్త కారంగా చేదుగా ఉండి, వాసన ఘాటైన కర్పూరంలాంటి సువాసనను విడుదల చేస్తుంది. వీటి రుచి అంత బాగుండదు.. అందుకే వంటల్లో వాడరు. కాకపోతే దీన్ని ఔషధాలలోఉపయోగిస్తారు. చాలా గిరిజన తెగలలో గాయాలు, చర్మపు సమస్యలకు, పాము, కీటకాల కాటులకు ఈ నల్ల పసుపును పేస్టుగా మార్చి అద్దుతారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయని వారు నమ్ముతారు. కడుపునొప్పిని తగ్గించడానికి, జీర్ణ సమస్యల నుంచి రక్షించడానికి ఇది ఎంతో మంచిదట.
ఈ నీలం పసుపు పొడిని నీళ్లలో కలిపి నుదుటిపై పేస్టులా రాసుకుంటే తలనొప్పి తగ్గుతుందని చెబుతారు. ఈ నీలం పసుపుకు హిందూ దేవత అయిన కాళీమాతకు దగ్గర సంబంధం ఉందని ఎంతో మంది నమ్మకం. కాళీ మాత పూజల్లో నైవేద్యంగా ఈ నీలం పసుపు కొమ్మును ఉంచుతారు. అలాగే కొన్ని కమ్యూనిటీలలో ఈ నల్ల పసుపును జేబులో పెట్టుకుంటారు. దీనివల్ల దుష్టశక్తుల నుంచి రక్షణ లభిస్తుందని వారి నమ్మకం..
ఈ నల్ల పసుపుతో కషాయాన్ని కూడా తయారు చేస్తారు. నీళ్లలో కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతందట.. అలాగే పోషకాహార సప్లిమెంట్‌గా కూడా పనిచేస్తుందట. ఈ పసుపు పొడిని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాలుగు నుంచి ఆరు నెలల వరకు నిల్వ చేయవచ్చు. అయితే ఇది అంత అరుదుగా దొరుకుతుంది. బయటకంటే.. ఆన్‌లైన్ మార్కెట్‌లో ఇది అందుబాటులో ఉంది. అమెజాన్, నెట్‌మెడ్స్‌లో మీరు దీన్ని విక్రయించవచ్చు.