నేషనల్‌ మీడియా పై బాలీవుడ్ ఫైట్‌…!

-

బాలీవుడ్‌ ఒక్కటైంది. జాతీయ మీడియా పై యుద్ధం ప్రకటించింది. సినీ ఇండస్ట్రీని అవమానించేలా కథనాలు ప్రసారం చేస్తున్నారంటూ కోర్టు మెట్లెక్కింది. వ్య‌క్తిగ‌త గోప్య‌త‌కు భంగం క‌లిగించారని పరువు నష్టం దావా వేసింది. కొన్నిరోజులు సైలెంట్‌గా ఉన్న బాలీవుడ్‌…ఇక తాడోపేడో తేల్చుకోవాలని డిసైడయ్యింది. నేషనల్ మీడియాతో పోరాటానికి సిద్ధమైంది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మరణం తర్వాత…బాలీవుడ్‌ నిత్యం వార్తల్లో ఉంటోంది. ఓ మాఫియా సుశాంత్‌ను తొక్కేసిందని, అవకాశాలు రాకుండా చేసిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి. కొన్ని ప్రొడక్షన్‌ హౌస్‌లపై సంచలన కథనాలు ప్రసారం చేశాయి జాతీయ మీడియా. రోజుకో కథనం వండివర్చాయి. సుశాంత్ మరణం కేసు కాస్తా…డ్రగ్స్ వైపు టర్న్ తీసుకోవడంతో అసలు రచ్చ మొదలైంది. రియా చక్రవర్తిని విచారించిన తర్వాత బాలీవుడ్‌ డ్రగ్స్‌ దందా తెరపైకి వచ్చింది. రోజుకో హీరోయిన్ పేరును ప్రకటిస్తూ… వార్తలు ప్రసారం చేశాయి. అంతేకాదు…కరణ్ జోహార్‌ ప్రొడక్షన్‌ హౌస్‌పైనా కథనాలు వచ్చాయి.

డ్రగ్స్ వ్యవహారంపై బాలీవుడ్‌ సైలెంట్‌గా ఉంటుందోని, నోరు విప్పాలంటూ కొన్ని ఛానెల్స్‌ డిబేట్లు నడిపాయి. దీంతో బాలీవుడ్‌ విషప్రచారం చేస్తున్నారంటూ కోర్టుమెట్లెక్కింది. 38 ప్రముఖ ప్రొడక్షన్ హౌస్‌లు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. తమ పరువుకు భంగం వాటిల్లేలా కథనాలు ప్రసారం చేస్తున్నారని ఫిర్యాదు చేశాయి ప్రొడక్షన్ హౌజ్‌లు. కొన్ని ఛానెల్స్‌ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నాయని కోర్టుకు వివరించాయి. ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు కట్టుబడి ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరింది హిందీ చిత్రసీమ.

ఇప్పటికే రకుల్ ప్రీత్‌సింగ్ కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నాయని పిటిషన్ వేసింది. పిటిషన్ విచారణ సందర్భంగా ఢిల్లీ కోర్టు ఇలాంటి రాతలపై సీరియస్ అయింది. నిజానిజాలు చూసుకుని రాయాలంటూ వార్నింగ్ ఇచ్చింది.

కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు 1994 ప్రకారం…. ప్రోగ్రామ్ కోడ్ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరింది. బాలీవుడ్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన కథనాలు పరువు నష్టం కలిగించే ఉన్నాయని గుర్తుంచుకోవాలని సూచించింది. అంతేకాదు కొన్ని ఛానెల్స్ బాలీవుడ్ గురించి అనరాని మాట్లు అన్నాయని.. మాటల్లో కూడా చెప్పలేని పదాలు ఉపయోగించారని కోర్టు ముందు ఆవేదన వ్యక్తం చేశాయి. ప్రతివాదులుగా రిపబ్లిక్‌ టీవీ ఛీఫ్ ఎడిటర్‌ ఆర్నబ్‌, టైమ్స్‌నౌ చీఫ్‌ ఎడిటర్‌ రాహుల్‌ను చేర్చారు. కోర్టు మెట్లెక్కినవారిలో షారుక్ ఖాన్ రెడ్ ఛిల్లీస్, సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్, అజయ్ దేవ్‌గన్, అక్షయ్ కుమార్, అమీర్ ఖాన్ నిర్మాణ సంస్థలు కూడా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news