బొత్స వర్సెస్ పువ్వాడ..పోలవరం వార్!

-

మళ్ళీ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం మొదలైంది..గతంలో పలుమార్లు రెండు రాష్ట్రాల్లోనే అధికార పార్టీ నేతల మధ్య తీవ్రమైన మాటల యుద్ధం నడిచింది…ఆ మధ్య రాయలసీమ ప్రాజెక్టు విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వార్ జరిగింది. అయితే అది కొన్ని రోజుల తర్వాత సర్దుకుంది. తాజాగా వరదల విషయంలో పోలవరం టాపిక్ వచ్చింది. ఇటీవల గోదావరికి వచ్చిన వరదల వల్ల భద్రాచలం ముంపుకు గురైంది. అయితే వరద సహాయ చర్యలు చేపడుతున్న కేసీఆర్ సర్కార్…అనూహ్యంగా భద్రాచలం మునగడానికి కారణం పోలవరం ప్రాజెక్టు అని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కామెంట్ చేశారు.

పోలవరంతో భద్రాచలానికి ముంపు ఉందని, ఇటీవల వచ్చిన వరదలకు అదే కారణమని, ఇదే సమయంలో ఏపీలో విలీనమైన 7 మండలాలు, భద్రాచలం పక్కనే ఉన్న ఐదు గ్రామాలని తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అలాగే పోలవరం ఎత్తు తగ్గించాలని పలుమార్లు కోరామని పువ్వాడ చెప్పుకొచ్చారు.

అయితే తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. సిడబ్ల్యూసీ డిజైన్ ప్రకారమే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుందని, విలీన మండలాలను కలపాలని కోరడం విచిత్రంగా ఉందని, తాము ఆ ఐదు గ్రామాల ప్రజల బాగోగులను చూసుకుంటామని, అలాగే తాము ఆదాయం వచ్చే హైదరాబాద్ ను కోల్పోలేదా? అని ప్రశ్నించిన బొత్స..కలసి కూర్చుని చర్చించుకోవాలి తప్పించి రెచ్చగొట్టడం సరికాదని అన్నారు.

ఇలా రెండు రాష్ట్రాల మధ్య వరద చిచ్చు పెట్టింది..ఇక పోలవరం ఎత్తు మరింత పెంచితే తమ ప్రాంతానికి ముప్పు ఎక్కువ ఉంటుందని భద్రాచలం ప్రాంతం వాళ్ళు ఎక్కువ ఆందోళన చెందుతున్నారు. పోలవరం ఎత్తు తగ్గించకపోతే ఆందోళన చేస్తామని ఖమ్మం ప్రాంతం నేతలు అంటున్నారు. అయితే రూల్స్ ప్రకారమే ప్రాజెక్టు కడుతున్నామని ఏపీ అంటుంది. మరి చూడాలి పోలవరంపై ఇంకా రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం ఏ స్థాయిలో జరుగుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news