ఈరోజు ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో తనకు స్నేహితుడైన వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి అల్లు అర్జున్ తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వెళ్లారు. తనకు రవిచంద్ర రెడ్డి ముందు నుంచే పరిచయమని గతంలో ఎన్నో సార్లు కలుస్తూ ఉండే వాళ్ళం కానీ ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆరు నెలలకు ఒక్కసారి మాత్రమే కలుస్తున్నాడని కష్టపడి పని చేస్తున్నాడు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలా? అంటూ అల్లు అర్జున్ తన స్నేహితుడిని గెలిపించమని విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే… ఇప్పుడు అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద కేసు నమోదైనట్లు సమాచారం. శిల్పా రవిచంద్ర రెడ్డి నివాసానికి అల్లు అర్జున్ దంపతులు వచ్చిన సమయంలో భారీగా ప్రజలు, ఫ్యాన్స్ అల్లు అర్జున్ ని చూసేందుకు తరలివచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లా ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. అయితే తమ అనుమతి లేకుండా జన సమీకరణ చేశారంటూ ఆ నియోజకవర్గానికి చెందిన రిటర్నింగ్ ఆఫీసర్ అల్లు అర్జున్ సహా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి మీద పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్ 188 కింద ఈ కేసు నమోదు చేయగా క్రైమ్ నెంబర్ 71/2024గా కేసు రిజిస్టర్ చేసినట్టు తెలుస్తోంది.