ఆంధ్రప్రదేశ్ లో ఆన్ లైన్ లోన్ యాప్స్ అరాచకాలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఒక్కొక్కరిగా బాధితులు బయటకు వస్తున్నారు. అధిక మొత్తంలో వడ్డీలు వసూలు, ఎవరైనా అప్పు కట్ట లేకపోతే బ్లాక్ మెయిల్ చేస్తూ, బండ బూతులు తిడుతూ వారిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు. కొందరైతే వీళ్ళ అరాచకాలు తట్టుకోలేక ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగికి చెందిన కొల్లి దుర్గాప్రసాద్, రమ్యలక్ష్మి దంపతులు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఆన్లైన్ కాల్ మనీ వ్యవహారంకాల్ మనీ వ్యవహారంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కాల్ మనీ వ్యవహారాలను ఏమాత్రం ఉపేక్షించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు
.ఆర్బిఐ అనుమతి లేని యాప్ లపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆత్మహత్య చేసుకున్న దుర్గారావు, రమ్య లక్ష్మీ దంపతుల ఇద్దరు పిల్లలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం 10 లక్షల పరిహారం అందించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. పిల్లల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు.