కరోనా వైరస్ క్రమంగా విస్తరిస్తున్న నేపధ్యంలో తెలంగాణా హైకోర్ట్ కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలో గురువారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షలు కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్ట్ లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు అయింది. అత్యవసర వ్యాజ్యంగా భావించి కోర్ట్ విచారణ చేపట్టింది. కరోనా విస్తరిస్తున్న నేపధ్యంలో పరీక్షలు వద్దని పిటీషనర్ వాదనలు వినిపించారు.
దీనిపై వెంటనే తీర్పు ఇచ్చిన కోర్ట్… పదో తరగతి పరీక్షలను వాయిదా వేయాలని ఆదేశాలు ఇచ్చింది. రేపు జరగాల్సిన పరీక్షా జరుగుతుందని తెలిపింది. ఈనెల 23 నుంచి 30 వరకు జరగాల్సిన అన్ని పరీక్షలు రీ షెడ్యూల్ చేయాలని ఈనెల 30 నుంచి ఏప్రిల్ 6వరకు జరగాల్సిన పరీక్షలపై పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కోర్ట్ సూచనలు చేసింది.
విద్యార్థులు కూడా ప్రశాంతంగా చదవలేని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి పరీక్షలు వాయిదా వేయాలి లేదా పటిష్ట భద్రత కల్పించాలని పిటీషనర్ కోర్ట్ ని కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తెలంగాణాలో 17 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. మరి కొంత మంది నమూనాలను ల్యాబ్ కి పంపించారు.