హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రవీణ్ రెడ్డి 2014లో వోడితెల సతీష్ కుమార్ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో కండువా మార్చి గులాబీ గూటికి చేరుకున్నారు.
అయితే గత రెండు దఫాలుగా హుస్నాబాద్ లో టిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ఒడితల సతీష్ కుమార్ గెలుస్తూ వస్తున్నారు. అయితే అధికార పార్టీలో టికెట్ రాదనుకున్నారో లేక అక్కడ గుర్తింపు లేదని భావించారో కానీ కాంగ్రెస్ లోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడానికి, అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలు అధికారం సాధించడానికి పోటీలు పడుతున్నాయి.
అధికార పార్టీలోని అసమ్మతి నేతలకు గాలం వేస్తూ తమ పార్టీలో చేరేలా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ఏకంగా చేరికల కమిటీలను ఏర్పాటు చేసుకున్నాయి. కాంగ్రెస్ చేరికల కమిటీ కన్వీనర్గా సీనియర్ నేత జానారెడ్డి ఉండగా.. బిజెపి చేరికల కమిటీ బాధ్యతలు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ కు అప్పగించారు. దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత బిజెపిలో భారీగా చేరికలు జరగగా.. ఇటీవల కాంగ్రెస్ లో ఎక్కువమంది జాయిన్ అవుతున్నారు.