తప్పు ఒప్పుకుని క్షమాపణ కోరిన బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్

-

బ్రిటన్‌ ప్రధానిగా బాధ్యత చేపట్టిన కొన్ని వారాల్లోనే లిజ్ ట్రస్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆమె నిర్ణయాలతో దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడటంతోపాటు సొంత పార్టీ సభ్యుల నుంచే ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీనిపై తొలిసారిగా లిజ్ ట్రస్ స్పందించారు.

‘మేం తప్పులు చేశామని గుర్తించాను. ఆ తప్పిదాలకు నన్ను క్షమించండి, ఇప్పటికే ఆ తప్పులను సరిచేసుకున్నాను. కొత్త ఛాన్సలర్‌ను నియమించాను. ఆర్థిక స్థిరత్వం, క్రమశిక్షణను పునరుద్ధరించాం. ఇలాగే ముందుకు వెళ్తూ ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తాం. 2019 మేనిఫెస్టో ఆధారంగా మేం ఎన్నికయ్యాం. వాటిని అమలు చేయాలని భావిస్తున్నాం’ అని లిజ్‌ ట్రస్‌ పేర్కొన్నారు.

ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నామన్న లిజ్‌.. ఉక్రెయిన్‌ సంక్షోభం కారణంగా అంతర్జాతీయ పరిస్థితులూ ప్రతికూలంగా ఉన్నాయని గుర్తుచేశారు. ఇటువంటి సమయంలో ఇంధన ప్యాకేజీపైనా దృష్టి పెట్టామని చెప్పారు. తాను ఎక్కడికీ వెళ్లనని.. వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ కన్జర్వేటివ్‌ పార్టీ నేతగా కొనసాగుతానని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నెలలోపు ప్రధానిపై అవిశ్వాసం పెట్టేందుకు పార్లమెంటు సభ్యులు యోచిస్తున్నట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో లిజ్‌ ట్రస్‌ ఈ విధంగా స్పందించారు.

Read more RELATED
Recommended to you

Latest news