తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. బిఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా రాజకీయాలు సాగుతున్నాయి.. ఒక అంశంలో ఒక పార్టీ పై చేయి సాధిస్తే.. మరో అంశంలో ఇంకో పార్టీ దూకుడుగా వ్యవహారిస్తుంది.. ఈ క్రమంలో ఫార్మాసిటీ కేంద్రంగా తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ సెగలు రేగుతున్నాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం పై వరుసగా పోరాటాలు చేస్తున్న బీఆర్ఎస్ కు.. ఫార్మా అంశం అడ్వాంటేజ్ అవుతుందా..? మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ ఎవరికి మైలేజ్ తీసుకురాబోతోంది..?? ఇంతకీ సీఎం సొంత జిల్లాలో జరుగుతున్న ఫార్మా రగడ ఏంటో చూద్దాం..
వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ని పోలీసులు అరెస్ట్ చేశారు.. కలెక్టర్ పై దాడి చేసిన కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సురేష్ తో.. పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడారని పోలీసులు చెబుతున్నారు.. పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మరి కొంతమంది బిఆర్ఎస్ నేతలు కూడా అరెస్టు కాబోతున్నారని చర్చ జోరుగా జరుగుతుంది.. ఏకంగా జిల్లా కలెక్టర్ పై దాడి చేశారు కాబట్టి ప్రభుత్వం, పోలీసులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారట. అయితే ఈ వ్యవహారాన్ని పొలిటికల్ గా వాడుకునేందుకు సిద్ధమవుతోంది బిఆర్ఎస్ పార్టీ.. ప్రజల నుంచి సానుభూతి రాబట్టుకునేందుకు వ్యూహాత్మకంగా స్కెచ్ వేస్తుందట..
స్థానిక రైతులకు ప్రజలకు ఇష్టం లేకుండానే కొడంగల్ ప్రాంతంలో ఫార్మా సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని.. అందుకే తాము అడ్డుకునే ప్రయత్నం చేశారని బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. రైతులకు అండగా ఉండేందుకే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నామని.. ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు.. ప్రజా పోరాటాలలో ఎన్ని కేసులు పెట్టినా.. తమకు సానుభూతి వస్తుందని బిఆర్ఎస్ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారట. సీఎం సొంత జిల్లాలో ఫార్మా సిటీ ఏర్పాటు ముందు నుంచే అన్ని పార్టీలకు తెలుసు.. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో ఎవరూ కూడా ఆందోళనలు చేసే సాహసం చేయలేదు.. కానీ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను గుర్తించిన బిఆర్ఎస్ పార్టీ పొలిటికల్ మైలేజ్ కోసమే రగడ చెసిందన్నే చర్చ తెలంగాణ రాజకీయాల్లో జోరుగా సాగుతోంది.
మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి అరెస్టును పొలిటికల్ గా వాడుకోవాలని గులాబీ పార్టీ భావిస్తుందట. కొడంగల్ ఎపిసోడ్ ను వీలైనంత హైలెట్ చేస్తూ జనంలోకి వెళ్లాలని.. కేటీఆర్ పక్క ప్లాన్ తో ముందుకు వెళుతున్నట్లు పార్టీ నేతలు గుసగుసలాడుతున్నారు.. అరెస్టులను కూడా అనుకూలంగా మలుచుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు ఇంటర్నల్ గా వినిపిస్తున్న టాక్.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కలెక్టర్ పై దాడి ఘటనను సీరియస్ గా తీసుకుంది.. మొత్తంగా ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి..