ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్‌కు చెందిన ఉద్యోగులు దేశ ద్రోహులని బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డె ఆరోపించారు. సంస్థ బాగు పడాలన్న ఉద్దేశం వారికి ఏమాత్రం లేదని, కొందరు ఉద్యోగులు అస్సలు ఏ మాత్రం పనిచేసేందుకు ఆసక్తిని చూపించడం లేదని అన్నారు. దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ ను ప్రైవేటు పరం చేస్తుందని.. అందువల్ల ఆ సంస్థలో పనిచేస్తున్న 88వేల మంది ఉద్యోగులను తొలగించడం ఖాయమని కూడా ఎంపీ అనంత్ కుమార్ అన్నారు. కర్ణాటకలో కుమ్తాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కొందరు బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు దేశ ద్రోహులని.. వారు సంస్థ అభివృద్ధిని కోరుకోవడం లేదన్నారు.
కేంద్ర ప్రభుత్వం బీఎస్ఎన్ఎల్ కు నిధులను అందజేసినా, సరైన మౌలిక సదుపాయాలు ఉన్నా.. ఉద్యోగులు అస్సలు పనిచేయడం లేదని, అందుకు వారు ఏ మాత్రం ఆసక్తిని చూపించడం లేదని ఎంపీ అనంత్ కుమార్ అన్నారు. బీఎస్ఎన్ఎల్ ప్రభుత్వ డబ్బును వృథా చేస్తుందని అన్నారు. బీఎస్ఎన్ఎల్ సంస్థ దేశానికి మచ్చలా మారిందన్నారు.