సాధారణంగా ఏ పొలిటికల్ పార్టీ అయినా ఆ పార్టీకి ఉండే స్టేట్ చీఫ్ మంచి వక్త అయి ఉండాలని పార్టీ కార్యకర్తలు, నేతలు కోరుకుంటారు. ఎందుకంటే తమ పార్టీ వాదనను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వారు ఉపయోగపడుతారు. ఈ క్రమంలోనే ప్రజలకు మంచి సంకేతాలు వెళ్తాయి. ఒకవేళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడికి భాషపైన పట్టులేకపోతే ఇక అంతే సంగతులు..అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే.. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్‌పై దాడి చేయించారని ఆరోపించే క్రమంలో బీజేపీ స్టేట్ చీఫ్, ఎంపీ బండి సంజయ్ కుమార్ నోరు జారారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా కొందరు ఆయన్ను ట్రోల్ చేస్తున్నారు. అయితే, సంజయ్ ఇప్పటికే చాలా సార్లు టంగ్ స్లిప్ అయ్యారు. కానీ, ఈ సారి ఏకంగా పార్టీపైన స్లిప్ అయ్యారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి తమ పార్టీలోకి వస్తానంటే ఇంకా భ్రష్టు పడతదనే చేర్చుకోలేదని సంజయ్ అన్నారు. అంటే తమ పార్టీ ఆల్రెడీ భ్రష్టు పట్టిందా? అనే చర్చను కొందరు లేవనెత్తుతున్నారు.
ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి పార్టీపైన ఇలా నోరు జారడం సంచలనం రేపుతోంది. సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో ఆల్రెడీ బీజేపీ తెలంగాణ పార్టీ భ్రష్టు పట్టి పోయిందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక సంజయ్ మాటలతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు షాక్ తిన్నారు. అయితే, రాష్ట్ర అధ్యక్షుడు కార్పొరేటర్‌పై జరిగిన దాడిని చూసి ఆవేశంలో మాట్లాడుతున్న క్రమంలో ఫ్లో లో అలాంటి మాటలు వచ్చినట్లు సంజయ్ సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.