కరోనా మహమ్మారి బారిన పడి ఎంతో మంది హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇక పరిస్థితి తీవ్రతరం అయినవారికి హాస్పటళ్లలో చికిత్స అందిస్తున్నారు. పేదలకు మాత్రం ప్రభుత్వ హాస్పిటళ్లు చికిత్స అందిస్తుండగా.. స్థోమత ఉన్నవారు ప్రైవేటు హాస్పిటళ్లలో చికిత్స పొందుతున్నారు. అలాగే ఓ వ్యాపారవేత్త ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనా చికిత్స పొందాడు. బిల్లు చూసి షాకయ్యాడు. అంత బిల్లు తనకే ఇబ్బందిగా అనిపించిందని, ఇక పేదలకు చికిత్స ఎలా అందుతుందని భావించి అతను ఏకంగా తన ఆఫీస్‌నే పేదల కోసం హాస్పిటల్‌గా మార్చేశాడు.
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన కదర్ షేక్ అక్కడి ఓ ప్రయివేటు హాస్పిటల్‌లో 20 రోజుల పాటు కరోనా చికిత్స తీసుకుని కోలుకున్నాడు. హాస్పిటల్ వారు అతనికి రూ.లక్షల్లో బిల్లు వేశారు. దాన్ని చూసి అతను షాక్ తిన్నాడు. తాను వ్యాపారవేత్త కాబట్టి ఎలాగో బిల్లు చెల్లించాడు. కానీ పేదలకు చికిత్స ఎలా అందుతుంది ? అని అతను భావించాడు. దీంతో అతను తన ఆఫీస్‌ను కోవిడ్ హాస్పిటల్‌గా మార్చాలని అనుకున్నాడు.
కదర్ షేక్ అలా తన కార్యాలయాన్ని అక్కడి అధికారుల అనుమతి మేరకు కోవిడ్ హాస్పిటల్‌గా మార్చాడు. ఆ ఆఫీస్ మొత్తం 2800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. అందులో అతను 85 బెడ్లను ఏర్పాటు చేశాడు. హాస్పిటల్‌కు అవసరం అయ్యే స్టాఫ్‌కు అక్కడి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది. ఇక మిగిలిన వసతుల ఖర్చును షేక్ చూసుకుంటున్నాడు. కరోనా సమయంలో పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతోనే తాను తన కార్యాలయాన్ని హాస్పిటల్‌గా మార్చానని చెబుతున్నాడు. అతను చేసిన పనికి అందరూ అతన్ని అభినందిస్తున్నారు.