ఎమ్మెల్యేలు ఎవరు వచ్చిన రాజీనామ చేయాలనేది వైసీపీ నిబంధన. ఈ విషయంలో ఎలాంటి పునరాలోచన లేదని ఇటీవలే ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి క్లారిటీ కూడా ఇచ్చారు. దీంతో పార్టీ వీడే ఎమ్మెల్యేలు రాజీనామాలకు సిద్ధపడతారా అనే చర్చ ఊపందుకుంది. రాజధాని కోసమే పార్టీ మారితే పదవులు వదిలేయాలని టీడీపీ సవాల్ విసురుతోంది. అందుకే రాజీనామాల వ్యవహారం అంతర్గతంగా చర్చకు.. బహిర్గతంగా ఆసక్తికరమైన అంచనాలకు దారితీస్తోంది. టీడీపీ సవాల్‌ను స్వీకరిస్తున్నట్టు వాసుపల్లి ఇప్పటికే ప్రకటించారు. మాజీ మంత్రి గంటా సైతం పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని వైసీపీ పెద్దలకు చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో దక్షిణ, ఉత్తర నియోజకవర్గాలకు మళ్లీ ఎన్నికలు ఖాయమనే ఊహాగానాలు అన్ని పార్టీల్లోనూ వినిపిస్తున్నాయి.
గంటా శ్రీనివాస్ ఒకసారి గెలిచిన స్థానంలో తిరిగి నిలబడ్డం ఆయన రాజకీయ జీవితంలో లేదు. దీంతో నార్త్ బై ఎలక్షన్ కోసం బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తెగ ఆసక్తిని ప్రదర్శిస్తున్నారట. అంతేకాదు ఉప ఎన్నికవస్తే జనసేన- బీజేపీ కూటమిదే గెలుపని ధీమాగా ఉన్నారట. ఇందుకోసం ఆయన కొన్ని లెక్కలు వేసుకున్నారట. 2019ఎన్నికల్లో బహుముఖ పోటీ జరగ్గా విష్ణుకు 18వేల 700 ఓట్లు వచ్చాయి. జనసేన మరో 18వేలకు పైగా ఓట్లు సాధించింది. ప్రస్తుతం టీడీపీ బాగా వెనకబడింది. పైగా ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వచ్చే అంశంగా విష్ణుకుమార్ రాజు పదే పదే చెబుతున్నారు.
దక్షణ నియెజికవర్గం నుంచి ఎమ్మెల్యే వాసుపల్లి వెళ్లిపోవడంతో ఆ నియోజకవర్గం ఇంఛార్జ్ బాధ్యతలను తాత్కాలికంగా శ్రీభరత్ చేతిలో పెట్టింది టీడీపీ. రాజకీయ వారసత్వం, బాలకృష్ణ బంధుత్వం కలిసి రావడంతో రాజకీయాలకు కొత్త అయినా నాడు విశాఖ ఎంపీగా బరిలోకి దించింది టీడీపీ. ఆ ఎన్నికల్లో భరత్ 4వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో శ్రీభరత్ సేవలను విస్తృతంగా వాడుకోవాలని భావిస్తే విశాఖ దక్షిణం నుంచి బరిలోకి దించితే ఎలా ఉంటుందనే ఆలోచనలు చేస్తున్నారట. ఇందుకు కారణాలు లేకపోలేదు. దాదాపు 15 ఏళ్లుగా ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఒక్కరే ఈ స్ధానం నుంచి అన్నీ తానై నడిపించారు. ఇక్కడ ఎమ్మెల్యే స్ధాయి అభ్యర్ధి ఇప్పటికిప్పుడు టీడీపీకి లేని పరిస్ధితి. అలాంటి టీడీపీ ఇప్పుడు సౌత్ పై ఎక్కువ ఫోకస్ పెట్టడం చూస్తే ఏదో జరుగుతుందనే భావన కలుగుతోందట.