పార్టీ ఫిరాయింపుల నేపథ్యంలో ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీశ్ రావు అన్నారు. నాలుగు వారాల్లోగా గులాబీ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయం (అసెంబ్లీ సెక్రటరీ)కి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా హరీశ్ రావు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషనపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. ఈ తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామ్య విధానాలకు చెంప పెట్టు అని చెప్పారు.
హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం తథ్యమన్నారు.ఈ తీర్పు ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురై ఆయా నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు రావడం తథ్యమన్నారు.ఉపఎన్నికల్లో గులాబీ జెండా తప్పకుండా ఎగురుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. తాజాగా హైకోర్టు తీర్పు నేపథ్యంలో కారు పార్టీ దిగి హస్తం గూటికి చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై వేటు పడే అవకాశం ఉంది.