టీడీపీకి షాక్: బీజేపీలో చేరిన కౌశల్, బైరెడ్డి

-

ఏపీలో బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికల్లో ఒక్కశాతం కూడా ఓట్లు తెచ్చుకొని బీజేపీలోకి తాజాగా మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి, బిగ్ బాస్ తెలుగు సీజన్-2 విన్నర్ కౌశల్ బీజేపీ వర్కింగ్ ప్రెసిండెంట్ జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే పలువురు టీడీపీ నేతలు బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు చేరిన ఈ ఇద్దరికి కూడా టీడీపీతో అనుబంధం ఉంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి టీడీపీలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, 1994, 1999 ఎన్నికల్లో నందికొట్కూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు.

ఇక 2004లో నందికొట్కూరు నుంచి, 2009లో పాణ్యం నుంచి టీడీపీ తరుపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇక 2012లో టీడీపీని వీడి రాయలసీమ పరిరక్షణ సమితి పేరిట పార్టీ రాయలసీమ అభివృద్ధి కోసం పోరాటం చేశారు. అయితే ఆ పార్టీ పెద్దగా క్లిక్ కాకపోవడంతో మొన్న సార్వత్రిక ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరారు. కానీ అక్కడ ప్రాధాన్యత లేదని భావించి ఎన్నికల్లో టీడీపీలోకి వచ్చారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్న బైరెడ్డి ఇప్పుడు కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన జగన్, చంద్రబాబులపైనా విమర్శలు చేశారు. రాష్ట్ర విభజనకు జగన్, చంద్రబాబు కారణమని.. పదేళ్ల ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌ను ఏడాదికే వదులుకోవడంతో నష్టం జరిగింది అన్నారు. రాజధాని, హైకోర్టు ఏర్పాటుపై వైసీపీ ప్రభుత్వం ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతోందని, ప్రత్యేక హోదా పాత చింతకాయ పచ్చడి వంటిది అన్నారు.

అటు బిగ్ బాస్-2లో విన్నర్ గా నిలిచిన కౌశల్ మొన్న ఎన్నికల ముందు టీడీపీకి మద్ధతు తెలిపారు. విశాఖపట్నంకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో వెళ్ళి చంద్రబాబుని కలిసి ఎన్నికల్లో సపోర్ట్ ఇస్తానని చెప్పారు. కానీ టీడీపీ ఓటమి చెందడంతో మళ్ళీ అటు వైపు వెళ్లలేదు. ఈ క్రమంలోనే భార్య నీలిమతో కలిసి జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news