ప్రధాని నివాసంలో బిజేపి జాతీయ అధ్యక్షుడు నడ్డా, మోడి, అమిత్ షాలు ఇవాళ భేటీ అయ్యారు. దీంతో కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు మొదలయ్యాయి. మరో వారంలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ మంత్రివర్గంలోనూ మరికొన్ని చేర్పులు అవకశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీకి వచ్చి ప్రధాని మోడి, అమిత్ షా, నడ్డాలతో ఈ మేరకు యు.పి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ చర్చలు జరిపారు. వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న యు.పి అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర మంత్రి వర్గంలో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఏ క్షణంలో నైనా యు.పి మంత్రివర్గ విస్తరణ ఉండనుందని…ఆ తర్వాతనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరుగనుందని సమాచారం. అలాగే, యు.పి బిజేపిలో కూడా సంస్థాగత మార్పులు చేయనుంది అధిష్టానం. అటు గత ఏడాది కాలంగా కేంద్ర మంత్రి వర్గ విస్తరణపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. దేశంలో “కరోనా” విజృంభణ, పలు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల కారణంగా వాయుదా పడుతూ వచ్చింది కేంద్ర మంత్రివర్గ విస్తరణ.
ఒకటికి మించి మంత్రిత్వ శాఖల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు తోమర్, పియూష్ గోయల్, ధర్మేంద్ర ప్రదాన్, ప్రకాశ్ జావడేకర్ లాంటి కేంద్ర మంత్రులు. కేంద్ర మంత్రి వర్గంలో “అప్నాదళ్” నేత అనుప్రియ పటేల్, బీహార్ నుంచి బిజేపి నేత సునీల్ మోడి, ఇటీవలే బిజేపిలో జ్యోతిరాదిత్య సింధియా చేరిన తరుణంలో చేరిన పలువురు నేతలకు చోటు లభించే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం కూడా పలు మంత్రిత్వ శాఖల పనితీరుపై దాదాపు 5 గంటలకు పైగా సమీక్ష జరిగింది. నిన్నటి సమావేశంలో ఉక్కు, పెట్రోలియం శాఖ, జలశక్తి శాఖ, నైపుణ్యాభివృధ్ది శాఖ, పౌర విమానయాన శాఖ, భారీ పరిశ్రమలు, పర్యావరణ శాఖల పనితీరుపై ఆయా శాఖల మంత్రులతో సమీక్ష నిర్వహించారు. ఈ రోజు సమావేశంలో కూడా పలువురు మంత్రులు పాల్గొన్నట్టు సమాచారం. ప్రధాని మొత్తం 79 కేంద్ర మంత్రులను నియామకం చేసే అవకాశం ఉండగా, ఇంకా రెండు డజన్లకు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇక మంత్రివర్గం విస్తరణ ఎప్పుడు జరుగుతుందో చూడాలి మరీ.