హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్.. ఎలా పిలిచినా ఇదొక ప్రమాదకరమైన అనారోగ్య సమస్య. సరైన డైట్, జీవనవిధానం పాటిస్తేనే హైబీపీ అదుపులో ఉంటుంది. హైబీపీకి టైముకు చికిత్స కూడా తీసుకోవాలి. దీని వల్ల ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోవాలి. అందుకు గాను సరైన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. ఉప్పు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే హైబీపీ సమస్య ఎక్కువవుతుంది. అందువల్ల ఉప్పును తక్కువగా తీసుకోవాలి. అలాగే ఫైబర్, పొటాషియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకుంటే హైబీపీ తగ్గుతుంది. అయితే హైబీపీకి, విటమిన్ సికి సంబంధం ఉంటుందా ? విటమిన్ సి వల్ల హైబీపీని తగ్గించవచ్చా ? అంటే…
విటమిన్ సి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషక పదార్థం. దీంతో ఇతర అనేక ప్రయోజనాలు కూడా కలుగుతాయి. చర్మాన్ని ఈ విటమిన్ సంరక్షిస్తుంది. ఎముకలు దృఢంగా మారేలా చేస్తుంది. శరీరం ఐరన్‌ను ఎక్కువగా గ్రహించేలా చేస్తుంది. దీంతో రక్తహీనత సమస్య తగ్గుతుంది. అలాగే గాయాలు కూడా త్వరగా మానుతాయి. అయితే సైంటిస్టులు చెబుతున్న ప్రకారం.. విటమిన్ సి ని నిత్యం తీసుకుంటే హైబీపీ తగ్గుతుంది. విటమిన్ సి ట్యాబ్లెట్లు తీసుకున్నా లేదా విటమిన్ సి ఉన్న ఆహారాలను తిన్నా హైబీపీని నియంత్రించవచ్చు. సైంటిస్టులు చెబుతున్న ఈ విషయాలను ప్రయోగాత్మకంగా పరిశీలించారు కూడా. సదరు ప్రయోగాలకు చెందిన వివరాలను క్లినికల్ న్యూట్రిషన్ అనే అమెరికన్ జర్నల్‌లో ప్రచురించారు.
విటమిన్ సిని నిత్యం 75 నుంచి 90 మిల్లీగ్రాముల మోతాదులో తీసుకోవాలి. లేదా నిత్యం ఆరెంజ్ జ్యూస్‌ను తాగినా హైబీపీ తగ్గుతుందని వెల్లడైంది. జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ చేపట్టిన పరిశోధనలో నిత్యం 500 మిల్లీగ్రాముల మోతాదులో విటమిన్ సి ని తీసుకుంటే హైబీపీ చాలా వరకు తగ్గుతుందని తేల్చారు. విటమిన్ సి శరీరంలో అత్యధికంగా ఉండే ద్రవాలను బయటకు పంపుతుంది. అలాగే రక్త నాళాల గోడలపై అధిక ఒత్తిడి పడకుండా చూస్తుంది. దీంతో హైబీపీ తగ్గుతుంది.
విటమిన్ సి మనకు అనేక పదార్థాలో లభిస్తుంది. ఆరెంజ్ జ్యూస్, నిమ్మకాయలు, ఉసిరికాయ జ్యూస్, క్యాబేజీ, క్యాప్సికం, బత్తాయి పండ్లు, ద్రాక్షలు, కివీలు, టమటా జ్యూస్ తదితర పదార్థాలను నిత్యం తీసుకోవడం వల్ల విటమిన్ సి లభిస్తుంది. దీంతో హైబీపీ కంట్రోల్‌లో ఉండడమే గాక, ఇతర ప్రయోజనాలు కూడా కలుగుతాయి.