సాధారణంగా రెస్టారెంట్ల నిర్వాహకులు భోజన ప్రియులకు నోరూరించే రకరకాల వంటకాలు తయారు చేసి వడ్డిస్తుంటారు. ఆ వంటకాలతోనే రెస్టారెంట్లు పాపులర్ అవుతుంటాయి. ఇక అప్పుడప్పుడు ఫుడ్ ఫెస్టివల్స్, ఫుడ్ చాలెంజ్‌లను కూడా నిర్వహిస్తుంటారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించడంతోపాటు బోలెడంత పబ్లిసిటీ అవుతుంది. ఇలా గతంలో పలు రెస్టారెంట్లు భిన్న రకాల ఫుడ్ చాలెంజ్ లను నిర్వహించాయి. ఇక తాజాగా ఇంగ్లండ్‌లోని ఓ రెస్టారెంట్ వారు కూడా ఓ ఫుడ్ చాలెంజ్ ను నిర్వహిస్తున్నారు.
ఇంగ్లండ్‌లోని మాంచెస్టర్ నగరంలో ఉన్న లిలీస్ వెజిటేరియన్ ఇండియన్ క్విజిన్ రెస్టారెంట్‌లో ది గ్రాండ్ థాలి చాలెంజ్‌ను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా వడ్డించే పలు రకాల వంటకాలు మొత్తం సుమారుగా 7 కిలోల బరువు ఉంటాయి. అయితే వాటిని కేవలం ఒక గంటలో తినాలి. 24 ఇంచుల వెడల్పైన ప్లేట్‌లో వాటిని వడ్డిస్తారు. ఒక్క వ్యక్తే ఆ చాలెంజ్‌లో పాల్గొని పూర్తి చేయాలి.
ఆ భోజనంలో 50 రకాల ఇండియన్ డిష్‌లు ఉంటాయి. 6 రకాల డిజర్ట్స్, మూడు రకాల రైస్‌లు, 16 రకాల కర్రీలు, 8 రకాల రోటీలు ఉంటాయి. అన్నింటినీ పెద్ద ప్లేట్‌లో పెట్టి ఇస్తారు. వాటి బరువు 7 కిలోల వరకు ఉంటుంది. ఆ భోజనం ఖరీదు 35 పౌండ్లు (దాదాపుగా రూ.3611). ఆ భోజనాన్ని కేవలం 1 గంట వ్యవధిలోనే పూర్తి చేయాలి. అలా చేస్తే భోజనానికి అయిన ఖర్చును వెనక్కి ఇచ్చేస్తారు. దాంతోపాటు ఒక టీ షర్ట్‌ను ఉచితంగా అందిస్తారు.
అయితే కొందరు ఈ చాలెంజ్‌లో పాల్గొన్నారు కానీ మొత్తం తినలేకపోయారు. అయితే చాలెంజ్‌లో పాల్గొనగా మిగిలిన ఫుడ్ ఐటమ్స్‌ను చాలెంజ్‌లో పాల్గొన్నవారు ఇంటికి తీసుకెళ్లవచ్చు. పార్శిల్ చేసి ఇస్తారు. ఆహారం వృథాకాకుండా ఉండేందుకే ఫుడ్‌ను ఇంటికి తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తున్నామని ఆ రెస్టారెంట్ నిర్వాహకులు తెలిపారు.