హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్( Etela Rajender )ని ఓడించడానికి టీఆర్ఎస్ కింద, మీద పడుతుంది. ఎలాగైనా ఈటలని ఓడించి పరువు నిలుపుకోవాలని టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. పైగా తన అధికార బలాన్ని అంతా హుజూరాబాద్‌పైనే ఉపయోగిస్తుంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో ఈటలకే గెలిచే అవకాశాలు ఉన్నాయని పలు సర్వేలు చెబుతుండటంతో, టీఆర్ఎస్ ఏదొకరకంగా అక్కడి ప్రజలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇప్పటికే దళితబంధు పేరుతో పెద్ద ఎత్తున దళితుల ఓట్లు ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. అలాగే వివిధ పథకాలని కూడా ఇస్తున్నారు. అటు అభివృద్ధి కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హుజూరాబాద్‌లో నిధులు ఖర్చు పెడుతున్నారు. ఇక టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్ నాయకులు హుజూరాబాద్‌లోనే మకాం వేసి, ఈటలని ఓడించాలని కాళ్ళకు బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు.
కానీ ఎన్ని చేసిన హుజూరాబాద్‌లో ఈటల ఆధిక్యాన్ని టీఆర్ఎస్ తగ్గించలేకపోతున్నట్లు కనిపిస్తోంది. పైగా నియోజకవర్గంలో ఎక్కడకక్కడ టీఆర్ఎస్ నేతలకు ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయి. ఇప్పటికే పలువురు నేతలకు హుజూరాబాద్ ప్రజలు చుక్కలు చూపించారు. తాజాగా హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌ని ప్రజలు అడ్డుకున్నారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే హుజూరాబాద్‌లో అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
శిలాఫలకాలు, నిధులు వివరాలు లేకుండా పనులు ఎలా ప్రారంభిస్తారంటూ స్థానిక ప్రజలు ఫైర్ అవుతున్నారు. కేవలం ఎన్నికల కోసం హడావిడి చేస్తున్నారని, తర్వాత ఎవరూ హుజూరాబాద్ మొహం కూడా చూడరని, ఎప్పుడు ఇక్కడే ఉండే ఈటలకే మద్ధతు ఇవ్వాలని ఉద్దేశంతో అక్కడ ప్రజలు ఉన్నట్లు కనిపిస్తోంది. కేవలం ఈటల వల్లే టీఆర్ఎస్ ఇన్ని కార్యక్రమాలు చేస్తుందని భావిస్తున్నారు. అందుకే ఎక్కడకక్కడే టీఆర్ఎస్ నేతలకు చుక్కలు చూపిస్తున్నట్లు కనిపిస్తోంది.