కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో కరోనా కలకలం చోటుచేసుకుంది. పెదపాలపర్రు జెడ్పి ఉన్నత పాఠశాల, గురజ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఏకంగా 11 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. పెదపాలపర్రు జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ర్యాండమ్ గా నిర్వహించిన పరీక్షల్లో నలుగురు తొమ్మిదో తరగతి విద్యార్థులు, టి.సి తీసుకునేందుకు వచ్చిన నలుగురు పదవ తరగతి విద్యార్థులు, ఇద్దరు తల్లిదండ్రులకు పాజిటివ్ ఫలితాలు వచ్చాయి.
గురజ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన పరీక్షల్లో మూడో తరగతి విద్యార్థికి కొవిడ్ నిర్ధారణ అయింది. అప్రమత్తమైన మండల విద్యాశాఖ అధికారులు పెదపాలపర్రు జడ్పీ పాఠశాలకు సోమ, మంగళ వారాలు సెలవు ప్రకటించారు. గురజ పాఠశాలకు చెందిన అన్ని తరగతుల విద్యార్థులకు కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాఠశాలల్లో పరిస్థితి అదుపు తప్పకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నామని మండల విద్యాశాఖ అధికారి నరేష్ తెలియజేశారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు , అవసరమైతే పెదపాలపర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు సెలవులు పొడిగిస్తామని ఆయన చెప్పారు. మండలంలోని ఇతర పాఠశాలల్లో కూడా అన్ని తరగతుల విద్యార్థులకు ర్యాండమ్ కొవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని ఎంఈఓ నరేష్ తెలిపారు.