ప్రముఖ మానవ హక్కుల నేత, సామాజిక శాస్త్రవేత్త, ప్రొఫెసర్ హరగోపాల్‌పై పోలీసులు దేశ ద్రోహం కేసు నమోదు చేశారు. 2022లో ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్‌లో ఆయనపై దేశ ద్రోహం కేసు చేశారు. యూఏపీఏ, ఆర్మ్స్ యాక్ట్‌తో పాటు పది సెక్షన్ల కింద హరగోపాల్‌పై కేసు నమోదు చేశారు పోలీసులు. మావోయిస్టు పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కేసు బుక్ చేశారు పోలీసులు.
తనపై దేశ ద్రోహం కేసు పెట్టడంపై స్పందించారు ప్రొఫెసర్ హరగోపాల్.తెలంగాణ దశాబ్ధి ఉత్సవాల్లాంటి సందర్భాల్లో ఇలాంటి కేసులు పెట్టడం దురదృష్టకరమన్నారు. దేశద్రోహం , రాజద్రోహం కేసులు పెట్టొద్దని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. తనపై పెట్టిన దేశద్రోహం కేసు చెల్లదని హరగోపాల్ అన్నారు. 152 మందిపై కేసులు పెట్టడం కరెక్ట్ కాదన్నారు. చనిపోయిన వారిపై కూడా కేసులు పెట్టారని ఆరోపించారు. యూఏపీఏ చట్టం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండాల్సింది కాదన్నారు. దీనిపై లీగల్ గా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మావోయిస్టులకు తమ మద్దతు అవసరం లేదన్నారు. ఎక్కడో పేరుందని ఎలా కేసు పెడతారని ప్రశ్నించారు. దీనిపై తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. యూఏపీఏ చట్టాన్ని ఎత్తేయాలన్నారు.