విజయవాడలో సీఎం జగన్ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మేమంతా సిద్ధం బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు సీఎం జగన్ పై రాయితో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించి కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ ఘటన రాష్ట్రంలో రాజకీయ దుమారాన్ని రేపింది. ముఖ్యమంత్రి జగన్‌పై దాడి చేయించింది టీడీపీ నేతలేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌పై పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు.
ఇది ఆకతాయిలు చేసిన పని కాదని ,ఈ ఘటన వెనుక ఎవరున్నా వదలిపెట్టమన్నారు. కేసు దర్యాప్తులో అన్ని వివరాలు బయటకు వస్తాయని తెలిపారు. సీఎం జగన్ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమానా..?.. ఆయన కంటే పెద్ద వాళ్లా అన్నది విచారణలో తేలుతుందని పేర్కొన్నారు.ఈ కేసులో ఎవరినో ఇరికించాల్సిన అవసరం తమకు లేదన్నారు. ఈ దాడిపై చంద్రబాబు , పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అర్ధరహితమని సజ్జల కొట్టిపారేశారు.