గబ్బిలాల నుంచి మనుషులకు కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మనిషి నుంచి మనిషికి కూడా కరోనా సోకుతోంది. అయితే మనుషుల నుంచి ఇతర జంతువులకు.. ముఖ్యంగా పెంపుడు జంతువులకు కరోనా సోకుతుందా..? అంటే.. అందుకు అవుననే సమాధానం వినిపిస్తోంది. మనుషుల నుంచి కరోనా వైరస్ పిల్లులకు కూడా వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుందని సైంటిస్టులు తమ పరిశోధనల్లో తేల్చారు. ఈ మేరకు పలువురు పరిశోధకులు జర్నల్ సైన్స్ అనే ఓ వెబ్‌సైట్‌లో తమ అధ్యయన వివరాలను వెల్లడించారు.
మనుషులకు సోకుతున్న కరోనా వైరస్.. వారి నుంచి ఇతర జంతువులకు కూడా సోకుతుందా..? అన్న కోణంలో పలువురు పరిశోధకులు పరిశోధనలు చేశారు. అందులో భాగంగానే పిల్లులకు వారు వాటి ముక్కు ద్వారా కరోనా వైరస్‌ను ఎక్కించారు. దీంతో ఆ వైరస్ వాటికి వ్యాప్తి చెందింది. అయితే కరోనా వైరస్ కుక్కలకు సోకే అవకాశం లేదని సైంటిస్టులు తేల్చి చెబుతున్నారు. కరోనా సోకిన పిల్లుల్లో.. వాటి నోరు, ముక్కు, చిన్న పేగుల్లో.. ఆ వైరస్ ఉన్నట్లు సైంటిస్టులు గుర్తించారు. ఇక వాటి నుంచి వెలువడే శ్వాస అణువుల ద్వారా కరోనా వైరస్ ఇతర పిల్లులకు వ్యాప్తి చెందుతుందని నిర్దారించారు.
కాగా న్యూయార్క్ సిటీలో జూ కీపర్ ద్వారా కరోనా వైరస్ ఓ పులికి కూడా వ్యాప్తి చెందిన విషయం విదితమే. అందులో భాగంగానే ఈ వైరస్ ఏయే జీవాలకు వ్యాప్తి చెందవచ్చు..? ఒక వేళ వాటికి పలు వ్యాక్సిన్ల ద్వారా నయం చేయగలిగితే.. అవే వ్యాక్సిన్లను మనుషులకు కూడా ఉపయోగించవచ్చు కదా..? అన్న అంశాలను బేరీజు వేసుకుని సైంటిస్టులు పలు జీవులపై ప్రయోగాలు చేస్తున్నారు. ఇక ముందు ముందు ఏయే జీవాలకు కరోనా వైరస్ సోకుతుందనే విషయాన్ని సైంటిస్టులు వెల్లడించాల్సి ఉంది. అయితే ఈ విషయంపై మరోవైపు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) కూడా దృష్టి సారించింది. పెంపుడు జంతువులకు కరోనా సోకే ముప్పు ఉంటే.. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేసి.. వారు జాగ్రత్తగా ఉండేలా చూడాల్సిన బాధ్యత సైంటిస్టులపై ఉందని ఆ సంస్థ అభిప్రాయపడింది.