దేశంలో రోజు రోజుకీ విజృంభిస్తున్న కరోనా మహమ్మారిపై డాక్టర్లు, వైద్య సిబ్బంది ఎంతగానో పోరాటం చేస్తున్నారు. కరోనా రోగులకు చికిత్స అందించడంతోపాటు.. అనుమానితుల నుంచి శాంపిల్స్ స్వీకరించడం.. క్వారంటైన్‌లో ఉన్నవారిని పరిశీలించడం.. వంటి సేవలను నిత్యం 24 గంటల పాటూ అందిస్తున్నారు. ఈ క్రమంలో యావత్ భారతదేశం వారిని నిజమైన హీరోలుగా పేర్కొంటూ.. అభినందిస్తోంది. అయితే అలాంటి ఓ రియల్ హీరో అయిన ఓ డాక్టర్ గురించే ఇప్పుడు మనం తెలుసుకోవాలి..!
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ జేపీ హాస్పిటల్‌లో.. డాక్టర్ సచిన్ నాయక్ అనే వైద్యులు కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నాడు. గత వారం రోజులుగా అతను హాస్పిటల్‌లో పనిచేస్తున్నాడు. అయితే డ్యూటీ అయ్యాక అతను ఇంటికి వెళ్లడం లేదు. కరోనా తన భార్య పిల్లలకు వచ్చేందుకు అవకాశం ఉంటుందని భావించి.. అతను తన కారునే నివాసంగా మార్చుకున్నాడు. హాస్పిటల్ ఆవరణలోనే తన కారును ఉంచి అందులో ఉండడం మొదలు పెట్టాడు.
అలా డాక్టర్ సచిన్ నాయక్ తన విధులు ముగిశాక కారులో విశ్రాంతి తీసుకుంటాడు. అందులోనే తనకు కావల్సిన నిత్యావసరాలతోపాటు పలు పుస్తకాలను అతను ఏర్పాటు చేసుకున్నాడు. తీరిక సమయాల్లో ఆ పుస్తకాలను చదువుతున్నాడు. ఇక ఇంటి వద్ద ఉన్న తన భార్య, పిల్లలతో ఫోన్ కాల్, వీడియో కాల్‌లో మాట్లాడుతున్నాడు. అంతే తప్ప.. ఇంటికి మాత్రం వెళ్లడం లేదు. ఈ క్రమంలో అతని ఫొటోను కొందరు సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అతన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అభినందించారు. ప్రస్తుతం దేశంలో మీలాంటి రియల్ హీరోల అవసరం ఎంతైనా ఉందని ఆయన సచిన్‌ను ప్రశంసించారు..!