దిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాపై మరో కేసు నమోదైంది. దిల్లీ ఫీడ్‌బ్యాక్ యూనిట్‌లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. చట్టవ్యతిరేకంగా ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను రూపొందించడం, అమలు చేయడం వల్ల ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.36 లక్షల నష్టం వాటిల్లిందని సీబీఐ అభియోగాలు మోపింది. దిల్లీలో 2015లో ఆప్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎఫ్‌బీయూ యూనిట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.
లిక్కర్ స్కామ్, మనీలాండరింగ్ కేసుల్లో ఇప్పటికే జైల్లో ఉన్న మనీశ్ సిసోదియాపై సీబీఐ మరో కేసు నమోదు చేయడంపై ఆమ్ ఆద్మీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సుదీర్ఘకాలం పాటు సిసోదియాను కస్టడీలో ఉంచడమే ప్రధానమంత్రి ప్రణాళిక అంటూ ఆయన ఆరోపించారు. ఇది దేశానికి ఎంతో విచారకరమైన విషయమని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.