వివేకా హత్య కేసులో అరెస్టయిన నిందితులు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలను కస్టడీకి అప్పగిస్తూ సీబీఐ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 19 నుంచి 24 వరకు ఆరు రోజులపాటు కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. సీబీఐ పిటిషన్లపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
‘విచారణ సమయంలో వారిపై థర్డ్ డిగ్రీ ఉపయోగించరాదు. నిందితుల తరఫు న్యాయవాదులను విచారణ ప్రదేశంలోకి అనుమతించాలి. అయితే వారిని విచారణ జరుగుతున్నచోట కాకుండా దూరంగా ఉంచాలి. చివరిరోజు వైద్య పరీక్షలు నిర్వహించి, నిందితులను కోర్టులో హాజరుపరచాలి. కస్టడీ పూర్తయ్యాక నివేదిక సమర్పించాలి’’ అని సీబీఐని కోర్టు ఆదేశించింది.
ఈ క్రమంలో ఇవాళ్టి నుంచి భాస్కరరెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలను 24వ తేదీ వరకు ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ నిమిత్తం చంచల్‌గూడ జైలు నుంచి సీబీఐ అధికారులు కస్టడీకి తీసుకోనున్నారు. అనంతరం సీబీఐ కార్యాలయంలో విచారణ చేపట్టనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు విచారణ సమయంలో వారికి ఆహారం, టీ, టిఫిన్, వసతి కల్పించనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు.