కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా (సిబిఐ) తాజాగా 60 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ క్రమంలోనే సిబిఐ కొత్త ట్విట్టర్ హ్యాండిల్ ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. గతంలో ప్రభుత్వ శాఖల్లో అవినీతి జరిగేదని.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని వెల్లడించారు.
అవినీతిపై పోరాటంలో సిబిఐ ది కీలకపాత్ర అన్న ఆయన.. 2014 తర్వాత సిబిఐ స్వేచ్ఛగా పనిచేస్తుందన్నారు. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారని తెలిపారు. 2g వేలానికి 5g వేలానికి ఎంతో తేడా ఉందన్నారు. గతంలో రూపాయిలో 85 పైసలు దోపిడీ ఉండేదని.. కానీ ఆ సిస్టంను ధ్వంసం చేశామన్నారు. 2 జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం అని, ఆర్థిక నేరగాళ్లు వేల కోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారని వ్యాఖ్యానించారు. బిజెపి ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తుందన్నారు ప్రధాని మోడీ.