కరోనా ఎఫెక్ట్‌.. సీబీఎస్‌ఈ, జేఈఈ పరీక్షలు వాయిదా!

-

మాయదారి కరోనా ప్రపంచ ప్రజానీకాన్ని ముప్పుతిప్పలు పెడుతున్నది. ఇప్పటికే పలు దేశాల్లో విద్యాసంస్థలు, షాపింగ్‌ మాళ్లు, సినిమా థియేటర్లు, పర్యాటక ప్రదేశాలు, దేవాలయాలు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు మొదలైన వాటిని మూసివేయడంతో జనం ఇండ్లకే పరిమితమయ్యారు. మిగతావాటి బంద్‌ ప్రభావం ఎలా ఉన్నప్పటికీ విద్యాసంస్థల బంద్‌ మాత్రం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఆందోళనకు గరిచేస్తున్నది.

అయితే, విద్యాసంస్థలు బందయినా పరీక్షలు మాత్రం యథాతధంగా జరుగుతాయని అంతా భావించారు. ఆ మేరకే తెలంగాణలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు దాదాపుగా పూర్తయ్యాయి. పదోతరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి. కానీ జాతీయ స్థాయి పరీక్షలకు మాత్రం కరోనావల్ల అవరోధం ఏర్పడింది. దేశంలో కరోనా రోగుల సంఖ్య క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 150 దాటడంతో.. దేశంలో అన్ని రకాల పరీక్షలన మార్చి 31 వరకు వాయిదా వేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆదేశించింది.

అకాడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం తరగతులు, పరీక్షల నిర్వహణ ముఖ్యమే అయినప్పటికీ, అదే సమయంలో విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం కూడా ప్రధానమే అన్న విషయాన్ని గమనించాలని హెచ్‌ఆర్‌డీ మినిస్ట్రీ పేర్కొన్నది. కేంద్రం ఆదేశాలతో సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) దేశ, విదేశాల్లో నిర్వహించనున్న 10, 12 తరగతుల పరీక్షలను మార్చి 31 వరకు వాయిదా వేసింది. అయితే తిరిగి పరీక్షలను ఎప్పుడు నిర్వహించేదీ పరిస్థితులను సమీక్షించి త్వరలో ప్రకటించనున్నట్లు తెలిపింది.

వాయిదా పడిన సీబీఎస్‌ఈ పరీక్షలు మార్చి 31 తర్వాత జరిగే అవకాశం ఉండటంతో.. ఈ పరీక్షల తేదీలు ఏప్రిల్‌ 5 నుంచి 11 వరకు జరుగాల్సిన జేఈఈ పరీక్షల తేదీలతో క్రాష్‌ అయ్యే పరిస్థితి ఏర్పడింది. దీంతో జేఈఈ పరీక్షల నిర్వహణకు బాధ్యతవహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) కూడా పరీక్షలను వాయిదా వేసింది. జేఈఈ పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై కొత్త షెడ్యూల్‌ను ఈ నెల 31న ప్రకటించనున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news