కేంద్ర హోం మంత్రిత్వ శాఖ దేశంలోని 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను 10 ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను విడుదల చేశారు. పోలీస్ స్టేషన్లలో అందుబాటులో ఉండే వసతులతోపాటు ప్రజలకు పోలీసులు ఏ విధంగా సేవలు అందిస్తున్నారు, కేసులను ఎంత వేగంగా పరిష్కరిస్తున్నారు.. అనే పలు విషయాల ఆధారంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లోని పోలీస్ స్టేషన్లను సర్వే చేశాక.. కేంద్రం ఈ జాబితాను విడుదల చేసింది.
ఇక కేంద్రం విడుదల చేసిన టాప్ 10 బెస్ట్ పోలీస్ స్టేషన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
1. మణిపూర్ రాష్ట్రంలోని తౌబల్ జిల్లాలో ఉన్న నాంగ్‌పోక్ సెక్మై పోలీస్ స్టేషన్ దేశంలోనే నంబర్ వన్ పోలీస్ స్టేషన్ గా నిలిచింది.
2. తమిళనాడులోని సేలం సిటీలో ఉన్న ఏడబ్ల్యూపీఎస్ – సురమంగళం
3. అరుణాచల్ ప్రదేశ్ లోని చాంగ్లాంగ్లో ఉన్న ఖర్సంగ్ పోలీస్ స్టేషన్
4. చత్తీస్‌గడ్‌లోని సూరజ్‌పూర్‌లో ఉన్న జిల్మిల్ (భయ్యా ఠానా)
5. గోవాలోని సౌత్ గోవాలో ఉన్న సెంగువమ్
6. అండమాన్ నికోబార్ దీవుల్లోని నార్త్ అండ్ మిడిల్ అండమాన్‌లో ఉన్న కాలిఘాట్ పీఎస్
7. సిక్కింలోని ఈస్ట్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న పాక్యొంగ్ పీఎస్
8. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌లో ఉన్న కంత్ పీఎస్
9. దాద్రా అండ్ నాగర్ హవేలీలో ఉన్న ఖన్వెల్ పీఎస్
10. తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో ఉన్న జమ్మికుంట టౌన్ పీఎస్ దేశంలోని టాప్ 10 బెస్ట్ పోలీస్ స్టేషన్ల జాబితాలో 10వ స్థానంలో నిలిచింది.
ఈ ఏడాదిలో కరోనా ఉన్నప్పటికీ అధికారులు సర్వేను పూర్తి చేసి మరీ ఈ జాబితాను ప్రకటించడం విశేషం. ఇక మొదటి దశలో 750 అంతకన్నా ఎక్కువ పోలీస్ స్టేషన్ల ఉన్న రాష్ట్రాల నుంచి 3 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేసి జాబితా సిద్ధం చేశారు. అలాగే ఇతర రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి 2 చొప్పున ఉత్తమ పోలీస్ స్టేషన్ల జాబితాను సిద్ధం చేశారు. తరువాత కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 1 చొప్పున ఉత్తమ పోలీస్ స్టేషన్లను పరిగణనలోకి తీసుకున్నారు. ఈక్రమంలో ఈ మూడు జాబితాలను కలిపి వాటిలోంచి 10 ఉత్తమ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు.