దేశంలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న దృష్ట్యా దేశంలోని టీవీ చానళ్లు కోవిడ్‌పై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేలా కార్యక్రమాలను ప్రసారం చేయాలని కేంద్ర ప్రభుత్వం టీవీ చానళ్ల యాజమాన్యాలకు సూచించింది. కోవిడ్ చికిత్సా విధానం, కోవిడ్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ఉండడం, వ్యాక్సినేషన్ అనే మూడు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు టీవీ చానళ్లు కృషి చేయాలని కోరింది.
దేశంలో రోజు వారీ కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్నప్పటికీ మొత్తంగా చూస్తే కోవిడ్ ప్రభావం ఎక్కువగానే ఉందని కేంద్రం తెలిపింది. అందులో భాగంగానే ప్రజల కోసం పలు హెల్ప్ లైన్ నంబర్ల వివరాలను కేంద్రం ప్రకటించింది. ఆ నంబర్ల గురించి ప్రజలకు తెలియజేయాలని టీవీ చానళ్లను కేంద్రం కోరింది.
కేంద్రం అందుబాటులో ఉంచిన దేశవ్యాప్త హెల్ప్ లైన్ నంబర్ల వివరాలు ఇవే..
* 1075 – కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్
* 1098 – కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి సంక్షేమ మంత్రిత్వ శాఖ హెల్ప్ లైన్ నంబర్
* 14567 – కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత, వృద్ధుల సంక్షేమం మంత్రిత్వ శాఖ నంబర్
* 08046110007 – మానసిక సమస్యల కోసం కాల్ చేయాల్సిన హెల్ప్ లైన్ నంబర్
ఆయా నంబర్ల వివరాలను టీవీ చానళ్లు విస్తృతంగా ప్రచారం చేయాలని, అలాగే కోవిడ్ పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించాలని టీవీ చానళ్లను కేంద్రం కోరింది.