విశాఖపట్నంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో స్టిరీన్ వాయువు లీకై 11 మంది చనిపోయిన ఘటనను కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. ప్రధాని మోదీ ఓ వైపు బాధితులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. మరోవైపు ఆయన ఆధ్వర్యంలో గురువారం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేంద్రం ఓ ఉన్నత స్థాయి కమిటీని కూడా నియమించింది. ఇక వాయువు లీకైన ఘటన నేపథ్యంలో కెమికల్ కంపెనీలకు కేంద్రం వార్నింగ్ కూడా ఇచ్చింది.
లాక్‌డౌన్ కారణంగా మూసి ఉన్న కంపెనీలను తిరిగి ప్రారంభించేటప్పుడు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రం కెమికల్ కంపెనీలను ఆదేశించింది. పరిశ్రమల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకున్నాకే కార్యకలాపాలు ప్రారంభించాలని.. లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా ఈ ఘటనపై ఇప్పటికే ఏపీ హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
ఇక స్టీరిన్ వాయువు లీకవ్వడానికి కారణం.. పరిశ్రమలో ఆ రసాయనం ఉన్న ట్యాంకులకు అమర్చబడిన రిఫ్రిజిరేషన్ వ్యవస్థలో సాంకేతిక సమస్య రావడమేనని అధికారులు తేల్చారు. ఈ క్రమంలో పోలీసులు ఈ సంఘటనపై విచారణను వేగవంతం చేశారు.