భారత్ లో పన్ను చెల్లింపుదారుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. నిజాయితీ గల పన్ను చెల్లింపుదారులకు మరింత సాధికారికత లభించే విధంగా ఒక కొత్త వేదికను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ రోజు ఉదయం ఆయన పన్ను చెల్లింపుకి సంబంధించి కీలక ప్రకటన చేసారు. ‘పారదర్శక పన్ను విధానం’ను ఉదయం 11 గంటలకు ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మోడీ కీలక వ్యాఖ్యలు చేసారు. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి పన్నుల విధానంలో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ఆయన వివరించారు. ఈ ప్రత్యేక వేదిక ద్వారా సులువుగా ఫిర్యాదులు చేయవచ్చని ఆయన చెప్పుకొచ్చారు. నిజాయతీగా పన్నులు చెల్లించే వారికి ప్రత్యేక వేదిక ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
పన్నుల సంస్కరణల్లో పాలసీ ఆధారిత పరిపాలన అవసరమన్నారు. నిజాయితీ పరులులను గౌరవించే కొత్త ప్రయాణం నేడు ప్రారంభమవుతుంది అని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వేదికను ప్రారంభించడంతో, పన్ను చెల్లింపుదారుల జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వం మరో అడుగు వేసింది. సంవత్సరాలుగా, ఆదాయపు పన్ను శాఖ కార్పొరేట్ పన్నును తగ్గించడంతో సహా అనేక పెద్ద సంస్కరణలను చేపట్టింది అని ఆయన వివరించారు.