కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ ఇప్పటికీ పేదల బతుకులను చిదిమేస్తూనే ఉంది. సోరియాసిస్ వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తిని ముంబయి నుంచి తమిళనాడు తిరువళ్లూరు దాకా దాదాపు 1300 కి.మీ నడిచేలా చేసింది. సదరు సోరియాసిస్ బాధితుడు తమిళనాడువాసి. అయితే బతుకుతెరువు కోసం ముంబయిలోని ఓ హోటల్లో పనిచేసేవాడు. 2 నెలలకు ఒకసారి తమిళనాడులోని తిరువళ్లూరు వచ్చి సోరియాసిస్ ముందులు తీసుకుని మళ్లీ ముంబయి వెళ్లేవాడు. కానీ అనుకోకుండా వచ్చిన లాక్ డౌన్ ఉపద్రవం ఎక్కడివాళ్లను అక్కడే బంధించింది.
మందులు తెచ్చుకునేందుకు రవాణా సౌకర్యాలు లేక.. విమానంలో ప్రయాణించే స్థోమత లేక నడక మొదలుపెట్టాడు బాధితుడు. దాదాపు 115 రోజులు నడిచి తమిళనాడు చేరుకున్నాడు.బాధితుడి దుస్థితి చూసిన స్థానిక ఎస్ఐ రాజేంద్రన్.. వైద్యాధికారులతో మాట్లాడి అతడ్ని చెన్నైలోని కేఎంసీ ఆసుపత్రిలో చేర్పించారు. కరోనా మహమ్మారి సామాన్యుల జీవితంలో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది. జేబులు గుల్ల చేసి మనుషులని రోగులను చేసింది.