ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఆయన నివాసంలో జరిగిన కేబినెట్ అత్యవసర భేటీలో తెలంగాణకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాజాగా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల పంపిణీ వివాదానికి పరిష్కారం దిశగా కృష్ణా ట్రైబ్యునల్‌కు-2 అదనపు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్టు తెలిపారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలు ఖరారు అయినట్టు పేర్కొన్నారు. విభజన సెక్షన్‌లోని సెక్షన్ 89కు లోబడే ఈ బాధ్యతలు అప్పగించినట్టు వివరించారు. దీంతో, కృష్ణా పరీవాహక ప్రాంత ప్రజలకు మేలు చేకూరుతుందని చెప్పారు.
అంతర్ రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం, 1956 ప్రకారం కృష్ణా నదీ జల వివాదాల ట్రిబ్యునల్-IIకి విధివిధానాలను ఖరారు చేస్తూ కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ చట్టంలోని సెక్షన్ 5(1) కింద తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం ఉన్న కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్-II (కృష్ణా ట్రిబ్యునల్-2)కి అదనపు బాధ్యత అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ ట్రిబ్యునల్ చట్టపరమైన అభిప్రాయాన్ని స్వీకరించడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ ఫిర్యాదులను అంతర్ రాష్ట్ర నదీ జల వివాదాల చట్టం, 1956 సెక్షన్ (3)కు లోబడి పరిష్కరించనుంది.