పోలవరం ప్రాజెక్టును కేంద్ర నిపుణుల బృందం రెండో రోజు సందర్శించింది. ఈ సందర్భంగా ఇవాళ దండంగి, పోలవరం జల విద్యుత్ కేంద్రం పరిసరాల్లో మట్టిని సేకరించింది. స్థానిక, సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ సెంటర్లో దీన్ని పరీక్షిస్తామని సెంట్రల్ మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి.సిద్దార్థ్ హెడావో, విపుల్ కుమార్ గుప్తా తెలిపారు. ఫలితాల ఆధారంగా పోలవరం ప్రాజెక్టులో అవసరమైన ప్రాంతాల్లో ఈ మట్టిని వినియోగిస్తామని వెల్లడించారు.
పోలవరం ప్రాజెక్టులో కీలకమైన గ్యాప్-1 రాక్ ఫిల్ డ్యామ్ పనులకు కొద్దిరోజుల క్రితమే అధికారులు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. జలవనరుల శాఖ, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, మేఘా ఇంజినీరింగ్ అధికారులు ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో పూజా కార్యక్రమాలు చేశారు. గ్యాప్-1 రాక్ ఫిల్ డ్యామ్‌కు సుమారు 25 మీటర్ల ఎత్తుతో 540 మీటర్ల పొడవున నిర్మించనున్నారు. అన్ని విభాగాలు సమన్వయం చేసుకుంటూ నిర్ణీత గడువులోగా ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.