దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కట్టడి అయ్యే అవకాశాలు ఏ విధంగాను కనపడటం లేదు. ప్రతీ రోజు కూడా వందల సంఖ్యలో కేసులు నమోదు అవుతూ వస్తున్నాయి. ఇక కరోనా కు సంబంధించిన హెల్త్ బులిటెన్ ని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. కేంద్ర ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడారు. మరణాలు, కేసుల సంఖ్య ఆయన వివరించారు.
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 1007 కేసులు నమోదు అయ్యాయి అని లవ్ అగర్వాల్ పేర్కొన్నారు. దీనితో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,387కు చేరుకుంది. 24 గంటల్లో కరోనా బారిన పడి 23 మంది ప్రాణాలు కోల్పోయారని వివరించింది. ఇక కరోనా నుంచి 1,749 మంది కోలుకున్నారని ఆయన వివరించారు. ఇప్పుడు చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆయన పేర్కొన్నారు.
ఇక కరోనా గురించి కేంద్రం రెండు కొత్త విషయాలు చెప్పింది. 24 శాంపిల్స్‌ను టెస్ట్ చేస్తే అందులో ఒకటి పాజిటివ్‌గా నమోదవుతున్నట్లు లవ్ అగర్వాల్ చెప్పారు. అదే విధంగా ప్రతి ఆరు రోజులకు ఒకసారి కేసుల సంఖ్య రెట్టింపవుతు౦దని అన్నారు. రాష్ట్రాలకు 5 లక్షల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్‌ను పంపినట్లు ఆయన వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే కరోనా భారత్ లో చాలా తక్కువగా ఉందన్నారు.