మీ చావు మీరు చావండి.. కేంద్రం క‌ట్టె విరిచేసిందిగా..!

దేశంలో క‌రోనా కార‌ణంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌తో అన్ని రాష్ట్రాలు ఆర్ధికంగా ఇబ్బందులు ప‌డుతున్న విష‌యం తెలిసిందే. మ‌రోప‌క్క ఖ‌ర్చులు కూడా పెరిగాయి. రాబ‌డి పూర్తిగా త‌గ్గిపోయింది. మ‌రి ఈ నేప‌థ్యంలో అన్ని రాష్ట్రాల‌దీ ఒకే మాట‌. కేంద్రం ఆదుకోవాలి.. ఉదారంగా నిధులు ఇవ్వాలి! అనే!! నిజ‌మే. ప‌న్నుల్లో కేంద్రం త‌న వాటాను రాష్ట్రాల నుంచి ముక్కుపిండి మ‌రీ గుంజుకుంటున్న‌ప్పుడు క‌ష్టకాలంలో ఆ మాత్రం ఆదుకోవాల‌ని కోర‌డం రాష్ట్రాల‌ది త‌ప్పు ఎంత మాత్రం కాదు. మ‌రి ఈ స‌మ‌యం లో ఫెడ‌ర‌ల్ స్ఫూర్తిని కొన‌సాగిస్తూ. కేంద్రం ఏమైనా రాష్ట్రాల‌ను ఆదుకుందా? అంటే.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది.

మీ చావు మీరు చావండి.. మేం మాత్రం ఇంతే! అంటూ స్ప‌ష్టం చేసేసింది. ప్ర‌స్తుతం దేశంలో సోమ‌వారం నుంచి నాలుగో ద‌శ లాక్ డౌన్ ప్రారంభం కాబోతోంది. కొన్ని వెసులుబాటులు ఇచ్చినా.. ఎక్క‌డా క‌రోనా నియంత్ర‌ణ‌లోకి రాక‌పోయేస‌రికి.. త‌ప్ప‌ద‌నే కార ణంగా ఈ లాక్‌డౌన్‌ను కొన‌సాగించాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. ఈ నేప‌థ్యంలో కేంద్రం ఆర్ధికంగా రాష్ట్రాల‌ను ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. కానీ, మూడో ద‌శ లాక్‌డౌన్ ప్రారంభంలోనే రాష్ట్రాల్లోని కంటైన్మెంట్ జోన్లు మిన‌హా రెడ్‌, ఆరెంజ్‌, గ్రీన్ జోన్ల‌లో మందు అమ్మ‌కాలు సాగించుకోవ‌చ్చ‌ని స్ప‌ష్టం చేసింది. అంటే.. అప్ప‌టికే ఒక ద‌శ రాష్ట్రాలు అడిగిన నిధుల విష‌యంలో కేంద్రం చేతులు ఎత్తేసింది. మీ సొమ్మును మీరే సంపాయించుకుంటూ.. మాకు కూడా మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా ప‌న్నులు క‌ట్టండి(సెంట్ర‌ల్ ఎక్సైజ్ డ్యూటీ) అని తేల్చి చెప్పింది.

మోడీని ఎదిరించి మాట్లాడ‌లేని రాష్ట్రాల పాల‌కులు జీ హుజూర్ అన్నారు. అయితే, మ‌ద్యం కార‌ణంగా అనేక స‌మ‌స్య‌లు వెలుగు చూస్తున్నాయి. క‌రోనా వ్యాప్తి పెరిగిపోయింది. కుటుంబ ఘ‌ర్ష‌ణ‌లు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలో చాలా రాష్ట్రాల్లో ఈ విష‌యం న్యాయ వివాదానికి దారితీసి హైకోర్టుల జోక్యంతో మ‌ద్యం అమ్మ‌కాల‌పై నియంత్ర‌ణ‌లు వ‌చ్చాయి. దీంతో రాష్ట్రాల‌కు మ‌ళ్లీ ఆదాయం ప‌డిపోయింది. దీంతో ఇప్పుడు నాలుగో ద‌శ లాక్‌డౌన్ కొన‌సాగించే త‌రుణంలో మ‌ళ్లీ కేంద్రాన్ని రాష్ట్రాలు నిదులు అడిగే ప‌రిస్థితి వ‌చ్చింది. దీనిని ముందుగానే గ్ర‌హించిన మోడీ స‌ర్కారు.. అప్పులు చేసుకోండి.. త‌ర్వాత తీర్చుకోండి! అంటూ.. తాజాగా రాష్ట్రాల‌కు ఉన్న ఫిసిక‌ల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బ‌డ్జెట్ మేనేజ్‌మెంట్‌(ఎఫ్ ఆర్ బీఎం) ప‌రిమితిని 0.5 శాతం పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఫ‌లితంగా రాష్ట్రాల‌కు మ‌రో 50 వేల కోట్ల అప్పు చేసుకునే అవ‌కాశం ఏర్ప‌డింది. నిజానికి ఎఫ్ ఆర్ బీఎంను స‌డ‌లించ‌డం అంటేనే ఎంతో సాహ‌సంతో కూడిన ప‌ని. కానీ, ఇప్పుడు మోడీ ఏ రాష్ట్రం కూడా అడ‌గ‌కుండానే ఈ ప‌రిమితిని పెంచి.. తాను నిర్వ‌హించిన బాధ్య‌త నుంచి నైస్‌గా త‌ప్పుకొన్నార‌నే వాద‌న ప్ర‌బ‌లంగా వినిపిస్తోంది. అప్పులు అధికంగా తెచ్చుకుంటే.. ఆయా రాష్ట్రాల ప‌రిస్థితి ఏంటో అంద‌రికీ తెలిసిందే. అయినా కూడా తాంబూలాలిచ్చేశాం.. అన్న‌ట్టుగా.. మోడీ ప్ర‌భుత్వం నిధులు ఇవ్వ‌డం మానేసి అప్పులు చేసుకుని బ‌త‌క‌మ‌ని చెప్ప‌డంపై నిపుణులు నివ్వెర పోతున్నారు. మ‌రోప‌క్క‌, జీఎస్‌టీ విష‌యంలోనూ మోడీ త‌న వైఖ‌రిని బ‌య‌ట పెట్టుకున్నార‌నే వాద‌న కూడా బ‌లంగా వినిపిస్తోంది. నిజానికి జీఎస్టీలో రాష్ట్రాల వాటా ఇవ్వాల్సి ఉంది.

ఇది ఇప్ప‌టికీ.. లాక్‌డౌన్ ముందున్న ఎమౌంట్ ఇవ్వ‌లేదు. పైగా 14 వ ఆర్ధిక సంఘం పెట్టిన కోత‌ను అమ‌లు చేస్తున్నారు. ఇక‌, రెండు మాసాలుగా లాక్‌డౌన్ కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ.. జీఎస్టీ మిన‌హాయింపులు ఇవ్వ‌క‌పోవ‌డం మోడీ స‌ర్కారుకే చెల్లింద‌ని వ్యాపార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. నిజానికి ఈ మూడు మాసాల కాలానికి జీఎస్టీ మిన‌హాయింపులు ఇవ్వాల‌ని రాష్ట్రాలు కూడా కోరుతున్నాయి. కానీ, మోడీ ప్ర‌భుత్వం మాత్రం దీనిని వాయిదా వేస్తూ.. జూలై 31 నాటికి చెల్లించాల‌ని పేర్కొన్న‌దే త‌ప్ప‌.. మిన‌హాయింపు ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఈ ప‌రిణామాల‌ను బ‌ట్టి.. మేమింతే.. మీచావు మీరు చావండ‌ని మోడీ చెప్పిన‌ట్టుకాదా?! అని ప్ర‌శ్నిస్తున్నారు నిపుణులు. నిజ‌మే క‌దా!?