గత కొంత కాలంగా మూడు రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఇది మాకు సంబంధం లేని అంశం అని కేంద్రం అంటోంది. రాష్ట్రాల రాజధానుల విషయంలో తాము జోక్యం చేసుకోనని ముందు నుండీ చెబుతూ వస్తోన్న కేంద్రం ఇప్పుడు మరో మారు అదే విషయాన్ని స్పష్టం చేసింది. మూడు రాజధానులపై హైకోర్టులో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.
రాజధానుల్లో కేంద్రం పాత్రపై హోంశాఖ మరింత స్పష్టత ఇచ్చింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానులు తప్పులేదన్న కేంద్రం, విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడా లేదని కేంద్రం దాఖలు చేసిన అఫిడఫిట్ లో పేర్కొంది. ఈ విషయంలో కేంద్రం పాత్రపై పిటిషనర్ దోనే సాంబశివరావువి అపోహలే అని కేంద్ర హోం శాఖ పేర్కొంది. రాజధానికి అవసరమైన ఆర్ధిక సాయం చేస్తామని మాత్రమే చెప్పామన్న కేంద్రం, రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో జోక్యం ఉండబోదని స్పష్టం చేసింది.