హోర్డింగ్ క‌బుర్లు : స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ

-

ప‌ర‌మ పావన రూపం
ల‌క్ష్యం నిర్దేశిస్తుంది
మ‌నిషి త‌న నుంచి తాను
వేరుప‌డి భ‌గ‌వ‌త్ ద‌ర్శ‌నంలో
లీనం అయి ఉన్నాడా
లేదా త‌న‌ని తాను తెలుసుకుని
ప‌రమాత్మ రూపాన్ని ద‌ర్శించాడా?
ఇన్ని వేల ఏళ్ల త‌రువాత
స‌మాన‌త్వ సూచిక‌ల్లో మ‌నం ఎక్క‌డో ఆగిపోయాం
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఏం నేర్ప‌నుందో?

రంగారెడ్డి జిల్లా ముచ్చింత‌ల్ స‌మీపాన ఆల‌యం ఒక‌టి నిర్మాణానికి నోచుకుంది.అది జియ‌రు స్వామిది.విగ్ర‌హ రూపంలో స‌మాన‌త్వ ప్రబోధ ఒక‌టి వినిపించ‌నుంది.దాని పేరే స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. చిన జియ‌రు స్వామి క‌ల‌ల రూపం ఇది. జియ‌రు స్వామి చెప్పిన మాట ప్ర‌కారం మ‌నుషుల‌కు ఓ వెయ్యేళ్ల కింద‌టో ఇంకా కొన్ని వేల ఏళ్ల కింద‌టో స‌మానత్వం బోధించిన రూపం రామానుజాచార్యులు.విశిష్టాద్వైత సిద్ధాంత క‌ర్త. మ‌రో ర‌కంచ‌దువులో ఆయ‌న కులాల మ‌ధ్య స‌మాన‌త్వం కోరుకున్నాడు కానీ కుల నిర్మూల‌ను కాదు అని చ‌దివేను. ఆ మాట కూడా నిజ‌మే కావొచ్చు. కానీ అంత డీప్ డిస్క‌ష‌న్ లో ప‌బ్లిక్ లేరు. ఉండరు కూడా! సైద్ధాంతిక వాదాల‌ను ప‌ట్టించుకునేంత తీరిక సామాన్యుల‌కు ఉండ‌దు.వారికి అర్థంఅయ్యేలా చెప్పాలంటే అంద‌రికీ అందాల్సిన‌వి అంద‌రికీ అంద‌డ‌మే అందించ‌డ‌మే స‌మాన‌త్వ ప్ర‌తీక. వివ‌క్ష లేదా భేద భావం లేకుండా చూడ‌డం అన్న‌ది స‌మాన‌త్వం. మాన‌వావ‌ర‌ణ‌లో కోరుకునే స‌మాన‌త్వం.

ఉద‌యం టీ తాగుతూ తాగుతూ మా ఊళ్లో అంటే శ్రీ‌కాకుళంలో ఓ పెద్ద హోర్డింగ్ చూశాను.అల్లంత దూరాన న‌డి నెత్తిన ఉన్న ఆ హోర్డింగ్ చూశాక కొన్ని సందేహాలు వ‌చ్చేయి. చిన‌జియరు స్వామి చిద్విలాసంతో పాటు రామానుజ మూర్తి విగ్ర‌హ రూపం ఒక‌టి క‌నిపించి ఆనందంతోపాటు ఆశ్చ‌ర్యం ఏక కాలంలో పుట్టేయి.ఆ విధంగా మ‌నుషుల మ‌ధ్య ఉన్న అంత‌రాల తొల‌గింపున‌కు..తొల‌గి పోయాయి అని అనేందుకు మ‌రియు చెప్పేందుకు,విశ‌దీక‌రించేందుకు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్న‌ది మ‌రో కొండ గుర్తు రేప‌టి వేళ కానుందా అని కూడా అనిపించింది. మ‌నుషుల్లో అవి సాధ్యం అయ్యే నాటికి మ‌రో వెయ్యేళ్లు కూడా చాల‌క పోవ‌చ్చు.విశిష్టాద్వైత భావాలు ఇంకా ప్ర‌చారానికి నోచుకుంటూనే ఉంటాయి అప్ప‌టికీ!

మ‌నుషులుకు ముక్తి మార్గం ప్ర‌ధానం అని చ‌దివేను.వైదికం బోధించేది కూడా ఇదే క‌దా! ముక్తి అన్న ప‌దం ద‌గ్గ‌ర విస్తృత రీతి ఉంది. దేన్నించి మ‌నం విముక్తం కావాలి. కోపం నుంచి బాధ నుంచి దుఃఖం నుంచి పొందిన విముక్తం అమూల్యం అని అంటాను.అంటే ఇప్పుడు దేనిని మ‌నం వ‌ద్ద‌నుకోవాలి అన్న మాట ఒక‌టి నిర్దేశితం అయి ఉండాలి. దేనిని పొందాలి అన్న‌ది తెలిశాక దేనిని వ‌ద్ద‌నుకోవాలో కూడా స్ప‌ష్టాతి స్ప‌ష్టంగా నిర్థారించుకుని తీరాలి. ఆ విధంగా మ‌నుషుల్లో స‌మాన‌త్వం అన్న‌ది అతి పెద్ద అబ‌ద్ధం.

వెయ్యి కోట్ల‌కు పైగా వెచ్చించి నిర్మించిన ఆలయం నుంచి స‌మాన‌త్వం..ఆల‌యంలో స‌మాన‌త్వం..ఆల‌యం ఎదుట పైన ఆకాశాన దిగువ భూమిలో స‌మాన‌త్వ వీచిక‌లు పొంద‌డం సులువు అయిన ప‌ని కాదు. కోట్ల కాంతుల‌ను ఓ చోట చేర్చినంత సులువు అస్స‌లు కాదు. న‌క్ష‌త్ర మండ‌లాల‌ను వీక్షిచింనంత సులువు అంత క‌న్నా కాదు. నేల పొర‌ల్లో దాగిపోయిన ధాతువుల వెలికి తీత
అన్న‌ది సులువు కూడా కాదు. క‌నుక మ‌నుషులు ఇంకొంత కాలం స‌మాన‌త్వం,ఏక‌త్వం అన్న‌వి సాధించేందుకు ఇంకొంత కృషి చేయాలి. ఆ కృషి మ‌నుషులు చేయాలి కానీ విగ్ర‌హాలు చేయ‌వు. విగ్ర‌హాలు ఓ ఆలోచ‌న‌కు ప్రేర‌ణ. ఓఆలోచ‌న‌కు ఆచ‌ర‌ణ‌కు మ‌ధ్య సంధి స‌మ‌యంలో తారసిల్లే రూపాలు కొన్ని మంచి ప‌నులు చేయిస్తాయి. ఆవిధంగా స‌మ‌త కు సంకేతిక ఆ విగ్ర‌హం ఆ రూపం.

– హోర్డింగ్ క‌బుర్లు – మ‌న లోకం ప్ర‌త్యేకం

Read more RELATED
Recommended to you

Latest news