ఫ్యామిలీ అంతా చూసే కలర్ ఫుల్ లవ్ స్టోరి – ఛలో ప్రేమిద్దాం రివ్యూ

-

నటీనటులు: సాయి రోనక్, నేహా సోలంకి, శ‌శాంక్, సిజ్జు, అలీ, నాగినీడు, పోసాని కృష్ణ‌ముర‌ళి, ర‌ఘుబాబు, బాహుబ‌లి ప్ర‌భాక‌ర్‌, హేమ‌, ర‌ఘు కారుమంచి, సూర్య‌, తాగుబోతు ర‌మేష్‌, అనంత్ తదితరులు

సాంకేతిక వర్గం – సంగీతం – భీమ్స్ సిసిరోలియో, పాట‌లుః సురేష్ గంగుల‌, దేవ్‌,
ఎడిటింగ్ – ఉపేంద్ర జ‌క్క‌, ఆర్ట్ డైర‌క్ట‌ర్ – రామాంజ‌నేయులు, ఫైట్స్ -న‌భా-సుబ్బు,
కొరియోగ్ర‌ఫీ – వెంక‌ట్ దీప్‌, సినిమాటోగ్ర‌ఫీ – అజిత్ వి.రెడ్డి, జ‌య‌పాల్ రెడ్డి
నిర్మాతః ఉద‌య్ కిర‌ణ్‌, ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వంః సురేష్ శేఖ‌ర్ రేప‌ల్లె.

కథ
చదువుల్లో చురుకైన కుర్రాడు ఆత్మారావు (సాయి రోనక్). అతనికి ఇంట్లో తండ్రి (పోసాని) నస ఎక్కువ. బాగా చదివే అత్మారావును తండ్రి పోరు తప్పించుకుంటాడు. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వచ్చిన ఆత్మారావుకు మధుమతి ( నేహా సోలంకి) పరిచయం అవుతుంది. ఒక అమ్మాయిని వేధింపుల నుంచి కాపాడిన ఆత్మారావును ఇష్టపడుతుంది మధుమతి. సరదా అమ్మాయి మధుమతి చిలిపి చేష్టలు ఆత్మారావుని ఇంప్రెస్ చేస్తాయి. తన ప్రేమను మనసులోనే దాచుకుంటుంది మధుమతి. ఊరి పెద్ద, మామయ్య అయిన పెద్దప్ప (నాగినీడు), అన్న శివుడు (సూర్య) ఒప్పుకుంటేనే తన ప్రేమ సంగతి ఆత్మారావుకు చెబుదాం అనుకుంటుంది. సోదరి పెళ్లికి స్నేహితులతో పాటు ఆత్మారావును ఆహ్వానిస్తుంది మధుమతి. ఇలా కథ సాగుతుంటే అనూహ్యంగా మధుమతి కిడ్నాప్ కు గురవుతుంది. మధుమతి కిడ్నాప్ లో ఆత్మారావును అరెస్ట్ చేస్తారు పోలీసులు, ఇంతకీ మధుమతిని అపహరించించి ఎవరు, ఆమె ఎలా దొరికింది, ఆత్మారావు మధుమతి ప్రేమలో ఎలా ఒక్కటయ్యారు అనేది తెరపై చూడాల్సిన కథ.

నటీనటుల ప్రతిభ

ప్రెషర్ కుక్కర్ సినిమాతో మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్నారు సాయి రోనక్. ఛలో ప్రేమిద్దాం సినిమా ఆయన కెరీర్ కు మరో స్టెప్ అనుకోవచ్చు. ఆత్మారావు క్యారెక్టర్ లో సాయి రోనక్ మెప్పించాడు. సరదా, ఛలాకీ కుర్రాడిగా ఆకట్టుకున్నారు. తన తోటి వారితో సరదాగా ఉండే సీన్లతో పాటు పెద్దలకు బుద్ధి వచ్చేలా, మంచి మాటలు చెప్పే సన్నివేశాల్లోనూ మెచ్యూర్డ్ గా యాక్ట్ చేశాడు. 90ఎంఎల్ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న నేహా సోలంకి బొమ్మరిల్లులో జెనిలీయా క్యారెక్టర్ లా చాలా ఉత్సాహంగా నటించింది. మధుమతి క్యారెక్ట్రర్ లో నిజంగా జోష్ తీసుకొచ్చింది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ కు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఆ ఇంపార్టెన్స్ అంతా తన నటనతో తీర్చింది నేహా. నాగినీడుకు పెద్దప్ప క్యారెక్టర్ టైలర్ మేడ్. ఆయన చాలా సులువుగా ఈ పాత్ర పోషిస్తూ వెళ్లారు. మిగతా ఆర్టిస్టులు కూడా తమ పాత్రల మేరకు చక్కగా నటించారు.

సాంకేతిక నిపుణుల పనితీరు

ఛలో ప్రేమిద్దాం సినిమాను కలర్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు సురేష్ శేఖర్ దే. సినిమా అంతా ఫ్రెష్ గా, నీట్ గా కనిపిస్తుందంటే ఆయన సెన్స్ వల్లే. లవ్ స్టోరి సినిమాల పేరుతో నానా చెత్తను, ఇబ్బందికర సీన్స్ ను పెట్టే దర్శకులతో చూస్తే సురేష్ శేఖర్ కొత్త దర్శకుడైనా పరిణితితో సినిమాను తెరకెక్కించారు. పోసాని, హేమ, కూతుళ్లతో కామెడీ జెనరేట్ చేసిన దర్శకుడు. మధుమతి, ఆత్మారావు మధ్య మొదట్లో వచ్చే సీన్స్ తో తొలిభాగం కథను సరదాగా తీసుకెళ్లాడు. ద్వితీయార్థంలో అసలు కథ మొదలవుతుంది. ఇక్కడ నుంచి సినిమాలో డ్రామా క్రియేట్ అవుతుంది. ఊరిలో గొడవలు, ఒకరంటే ఒకరికి పడకపోవడం, వీళ్ల మధ్య ప్రేమికుల ఇబ్బందులు..ఇవన్నీ సెకండాఫ్ ఇంట్రెస్టింగ్ మలిచాయి. భీమ్స్ మ్యూజిక్ తో పాటు తాను చెప్పినట్లు నేపథ్య సంగీతంతోనూ అలరించాడు. ఫస్టాఫ్ సీన్స్ లో చాలా వరకు భీమ్స్ నేపథ్య సంగీత మాయతోనే ఎలివేట్ అయ్యాయి. ఎడిటింగ్, సినిమాటోగ్రపీ క్లాసీగా ఉన్నాయి. ఇక హిమాలయ స్టూడియో మాన్షన్స్ మేకింగ్ వ్యాల్యూస్. సినిమా మీద నిర్మాత ఉదయ్ కిరణ్ కు ఉన్న ప్యాషన్ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఈవారం ఓ చక్కటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ చూడాలనుకుంటే ఛలో ప్రేమిద్దాం థియేటర్లకు ఛలో అనేయండి

రేటింగ్ 3/5

Read more RELATED
Recommended to you

Latest news