టీడీపీ అధినేత చంద్రబాబు చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై.. యుద్ధభేరి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. 9వ రోజు ఉమ్మడి విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి రిజర్వాయర్ ను చంద్రబాబు సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం అనేక సాగునీటి ప్రాజెక్టులను నీరు గారుస్తోందని దుయ్యబట్టారు. సీఎం జగన్ వల్ల ఎన్నో నీటి ప్రాజెక్టులు నిలిచిపోయాయని పేర్కొన్నారు. అవే పూర్తి అయి ఉంటే.. ఈ పాటికి ఆంధ్రప్రదేశ్ ఎంతో అద్భుతంగా ఉండేదన్నారు చంద్రబాబు.
“తారకరామ తీర్థ సాగర్ రిజర్వాయర్ కు టీడీపీ ప్రభుత్వం రూ.104 కోట్లు ఖర్చు పెట్టింది… ఇదే ప్రాజెక్టుకు వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.57 కోట్లు! తారకరామ తీర్థ సాగర్ పనులు 41 శాతం పూర్తయ్యాయి. మద్దువలస రిజర్వాయర్ కు వైసీపీ సర్కారు రూ.1.3 కోట్లు ఖర్చు పెట్టింది. టీడీపీ హయాంలో తోటపల్లి బ్యారేజికి రూ.237 కోట్లు ఖర్చు చేశాం. తోటపల్లి బ్యారేజికి వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది రూ.12 కోట్లే. గజపతినగరం బ్రాంచ్ కెనాల్ కు టీడీపీ రూ.49.75 కోట్లు ఖర్చు చేసింది. ఇదే కెనాల్ కు వైసీపీ సర్కారు రూ.4.71 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది. నాగావళి-వంశధార నదుల అనుసంధానానికి వైసీపీ ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలని సంబంధిత మంత్రికి సవాల్ విసురుతున్నా” అంటూ చంద్రబాబు స్పష్టం చేశారు.