బుధవారం ఉదయం రాజధాని గ్రామం యర్రబాలెంకు చంద్రబాబు చేరుకున్నారు. సతీసమేతంగా అక్కడకు చేరుకున్న బాబు మూడు రాజధానుల ప్రకటనకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న దీక్షకు సంఘీభావం తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ.. ‘ప్రపంచంలో ఎక్కడైనా మూడు రాజధానులు ఉన్నాయా? జగన్ ఖైదీ నంబర్ 6093. ఇప్పుడు ఏపీకి సీఎంగా ఉన్నారు. ఆయనకు సిగ్గనిపించడం లేదా? ఈ సిగ్గులేని ముఖ్యమంత్రి మనపై పెత్తనం చెలాయిస్తున్నారు.
వీఎన్ రావు కమిటీ అంటున్నారు. బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అంటున్నారు. ఇది హైపవర్ కమిటీ అంటా? వీళ్లా రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించేది?’ అని చంద్రబాబు నాయుడు చురకలంటించారు. గతంలో హైదరాబాద్ లో తాను చూపిన చొరవ వల్లే అభివృద్ధి జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనతో ఇబ్బందులు వచ్చాయని చెప్పారు. ఆ ఇబ్బందులను అధిగమించాల్సిన సమయంలో పాలన సరిగా లేదని విమర్శించారు.